IPO News: మార్కెట్ల పతనంలో ఐపీవో బంపర్ లిస్టింగ్.. నిమిషాల్లో డబ్బులు డబుల్, తొలిరోజు ఇన్వెస్టర్స్ పండగ..
Dhanlaxmi Crop Science IPO: చాలా కాలం బేక్ తర్వాత తిరిగి ఐపీవోల కోలాహలం దేశీయ స్టాక్ మార్కెట్లలో స్టార్ట్ అయ్యింది. వారం మెుదటి రోజు ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అయిన కంపెనీ షేర్లు సంచలనం సృష్టించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లను నమ్ముకున్న వారి కంటే ఐపీవోలపై బెట్ వేసిన ఇన్వెస్టర్లు సంతోషంలో మునిగితేలుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ధనలక్ష్మీ క్రాప్ సెన్స్ కంపెనీ ఐపీవో గురించే. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అయిన స్టాక్ నేడు 90 శాతం ప్రీమియం ధర రూ.104.50 వద్ద గ్రాండ్ ఎంట్రీని నమోదు చేసింది. దీంతో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో విజయవంతంగా జాబితా అయ్యాయి. తాజా ఐపీవో నుంచి కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.23.80 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం 43.28 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ తన ఐపీవోను సాధారణ ఇన్వెస్టర్ల సబ్‍స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు అందుబాటులో ఉంచింది.

కంపెనీ ఈ క్రమంలో తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.52-55గా నిర్ణయించింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 2,000 షేర్లుగా ప్రకటించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోలో దరఖాస్తు చేయటం కోసం కనీసం రూ.1,10,000 పెట్టుుబడిగా పెట్టాల్సి వచ్చింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.6.37 కోట్లు విజయవంతంగా సమీకరించింది. కమలేష్‌కుమార్ జయంతిలాల్ పటేల్, అల్పేష్‌భాయ్ జయంతిభాయ్ పటేల్, మీట్ కమలేష్‌కుమార్ పటేల్ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు. తాజా ఐపీవోకి ముందు కంపెనీలో వీరికి ఉన్న వాటా 76.70% నుంచి ప్రస్తుతం 56.37 శాతానికి తగ్గింది. ఐపీవో బిడ్డింగ్ సమయంలో కంపెనీ దాదాపు రూ.164.08 కోట్ల విలువైన షేర్ల కోసం ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు అందుకుంది. అలాగే 555.83 రెట్లు దరఖాస్తులను అందుకుంది.
ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 441.18 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 1241.27 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ పోర్షన్ 197.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇష్యూకి అయిన ఖర్చులు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.
కంపెనీ వ్యాపారం..
2005లో స్థాపించబడిన కంపెనీ ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత విత్తన తయారీ సంస్థగా కొనసాగుతోంది. వివిధ క్షేత్ర పంటలు, కూరగాయల కోసం విత్తనాల అభివృద్ధి, ఉత్పత్తి, ప్రాసెసింగ్ చేసి విక్రయించటంలో ప్రసిద్ధి చెందింది. కంపెనీ సాంప్రదాయ బ్రీడింగ్ పద్ధతులను బయోటెక్నాలజికల్ టూల్స్‌తో అనుసంధానిస్తుంది. హైబ్రిడ్, ఓపెన్-పరాగసంపర్క రకాలైన క్షేత్ర పంటలు, కూరగాయల విత్తనాలను ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ దాదాపు 24 వివిధ రకాల పంటలు, కూరగాయలకు సంబంధించిన విత్తనాల ఉత్పత్తిలో పేరుగాంచింది. కంపెనీ ప్రధాన ఆదాయ వనరుగా పత్తి విత్తనాలు ఉన్నాయి. కంపెనీ అధిక లాభాలను వీటి విక్రయాల నుంచే చూస్తోంది.


Click it and Unblock the Notifications