IPO News: ఇన్వెస్టర్లను అడ్డంగా ముంచిన ఐపీవో.. బోరున ఏడుస్తున్న SME ఇన్వెస్టర్స్, బెట్ వేశారా?
Davin Sons Retail IPO: జనవరి రెండవ వారం నుంచి ఐపీవోల కోలాహలం, రద్దీ మార్కెట్లలో తిరిగి స్టార్ట్ అయ్యింది. దీంతో వరుస ఐపీవోల నుంచి లిస్టింగ్ గెయిన్స్ పొందాలని బెట్టింగ్ వేస్తున్నారు. అధిక అస్థిరత కలిగిన ఈక్విటీ మార్కెట్ల కంటే ఇక్కడ తక్కువ సమయంలో సేఫ్ గెయిన్స్ పొందవచ్చని వరుసగా ఐపీవోలకు దరఖాస్తులు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డేవిన్ సన్స్ రిటైల్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో బీఎస్ఈలో నేడు జాబితా అయ్యింది. అయితే వాస్తవంగా కంపెనీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధర కంటే 20 శాతం డిస్కౌంట్ రేటుకు స్టాక్ లిస్టింగ్ కావటంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పూర్తిగా నిరాశకు గురయ్యారు. కొన్న రేటు కంటే స్టాక్ నష్టాలకు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వటంతో షేర్లు అలాట్ అయిన పెట్టుబడిదారులు బోరున విలపిస్తున్నారు. దీంతో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి రూ.44 వద్ద నేడు జాబితా అయ్యాయి.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.8.78 కోట్లను సమీకరించాలని లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ 15.96 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం కంపెనీ ఐపీవో జనవరి 2 నుంచి జనవరి 6 వరకు ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.55గా ఉంచింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ప్రకటించటంతో రూ.1.10 లక్షలు కనీసం రిటైల్ ఇన్వెస్టర్లు వెచ్చించాల్సి వచ్చింది.
బీఎస్ఈ డేటా ప్రకారం పెట్టుబడిదారులు 69,101 అప్లికేషన్‌ల ద్వారా 15.96 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా.. 18.29 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్‌లు అందుకుంది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 164.78 రెట్లు, సంస్థాగత నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 76.91 రెట్లు దరఖాస్తులను అందుకుంది. మార్చి 2022లో స్థాపించబడిన డేవిన్ సన్స్ రిటైల్ మార్కెట్లో ఇతర బ్రాండ్‌ల కోసం జీన్స్, డెనిమ్ జాకెట్లు, షర్టులతో సహా రెడీమేడ్ దుస్తులను తయారీ, డిజైన్ చేయటంలో ప్రసిద్ధి చెందింది.
దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తాజా ఐపీవో ద్వారా వచ్చే డబ్బును గిడ్డంగి కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీకి హర్యాణా, దిల్లీ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, చత్తీస్ఘట్ రాష్ట్రాల్లో కస్టమర్లను కలిగి ఉంది. ఐపీవోకి ముందు కంపెనీలో ప్రమోటర్ల హోల్డింగ్ 90.68% ఉండగా.. ప్రస్తుతం అది 63.18%కి తగ్గింది.


Click it and Unblock the Notifications