బంగారం, వెండికి సవాల్.. రూ.1400కు చేరిన కిలో రాగి.. దొరికినంత దాచిపెట్టుకుంటున్న వ్యాపారులు..
గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి రికార్డు స్థాయి గరిష్టాలను చేరుకుంటున్న తరుణంలో.. వాటి బాటలోనే పారిశ్రామిక లోహం రాగి (Copper) ధరలు కూడా భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ వేదిక కామెక్స్ (COMEX) లో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. దేశీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసిఎక్స్ (MCX) లో Copper ధరల కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి వినియోగదారు అయిన చైనా మార్కెట్‌లోకి కొనుగోలుదారులు బలంగా తిరిగిరావడం.. గ్లోబల్ సరఫరా ఆటంకాలు, భౌగోళిక వ్యూహాత్మక నిల్వలు ఈ ధరల మంటకు ప్రధాన కారణాలుగా మారాయి.
భారత మార్కెట్‌లోని MCX ఎక్స్ఛేంజ్‌లో కిలో Copper ధర దాదాపు రూ. 1400 మార్కు వద్ద రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా చూస్తే COMEXలో పౌండు రాగి ధర సుమారు $6.57 నుండి $6.64 పరిధిలో గరిష్టాల్లో కొనసాగుతుండగా.. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో మెట్రిక్ టన్ను ధర $14,400 స్థాయిని దాటి రికార్డు ఎగువన ట్రేడ్ అవుతోంది.

ఈ భారీ పెరుగుదలకు ప్రధానంగా మూడు కారకాలు దోహదం చేశాయని చెప్పవచ్చు. మొదటిది ఏంటంటే.. చైనా మార్కెట్లో పారిశ్రామిక కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో అక్కడి రాగి నిల్వలు జనవరి 2024 తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయాయి. రెండవది ఏంటంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తి దేశాలైన చిలీ, ఇండోనేషియాలలో గనుల త్రవ్వకాలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ముడి రాగి ఎగుమతులపై కఠిన నిబంధనలు విధించింది. ఇక మూడవది ఏంటంటే.. రాగి ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలను విధించే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో వర్తకులు ముందస్తుగా అమెరికా గిడ్డంగుల్లో సరుకును భారీగా నిల్వ (Stockpiling) చేయడం ప్రారంభించారు.
రాగి ఉత్పత్తి కంటే దాని వినియోగం వేగంగా పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ ధరలు మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. గృహ విద్యుత్ వైరింగ్, రిఫ్రిజిరేటర్లు, టీవీల తయారీతో పాటు మౌలిక సదుపాయాలు (Infra), వ్యవసాయ రంగానికి రాగి అత్యంత ప్రాథమిక ముడిసరుకు.
అంతేకాకుండా, ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం వల్ల ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు సామాన్యులకు మరింత ప్రియం కానున్నాయి. అయితే, లోహ ఉత్పత్తి, మైనింగ్ రంగానికి చెందిన కంపెనీలతో పాటు కమోడిటీ ఇన్వెస్టర్లకు ఈ ర్యాలీ మంచి లాభాలను తెచ్చిపెడుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

