MCXలో కుప్పకూలిన రాగి ధరలు..6 వారాల్లో 10.5 శాతం పతనం.. కాపర్ కొనుగోలుపై ఇన్వెస్టర్లకు కీలక సూచన..
Copper Crash: అమెరికా మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ ఇప్పుడు అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లకూ తాకింది. పారిశ్రామిక రంగానికి అత్యంత కీలకమైన బేస్ మెటల్ రాగి (Copper) ధరలు నాలుగు నెలలకు పైగా కనిష్ట స్థాయికి పడిపోయాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అత్యధికంగా ట్రేడయ్యే నవంబర్ కాపర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 1,282.8 వద్ద ట్రేడవుతూ బలహీనపడ్డాయి.
అక్టోబర్ ఆరంభంలో కిలోకు రూ. 1,433 వద్ద నమోదైన రికార్డు గరిష్ట స్థాయితో పోలిస్తే దేశీయ మార్కెట్లో రాగి ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా క్షీణించాయి. అంతర్జాతీయంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో సైతం మూడు నెలల కాపర్ ఫ్యూచర్స్ వరుసగా ఆరు వారాలుగా పతనమవుతూ.. నాలుగు నెలల కనిష్ట స్థాయి అయిన టన్నుకు 13,270 డాలర్ల వద్దకు దిగివచ్చాయి. అక్టోబర్ ప్రారంభంలో నమోదైన 14,702 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయి నుండి ఇది దాదాపు 10 శాతం తక్కువ.

అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరల పతనానికి ప్రధానంగా మూడు కీలక కారణాలు దోహదపడుతున్నాయి. మొదటిది ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాగి వినియోగదారైన చైనా ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదు కావడం. అక్టోబర్ నెలలో చైనా రిటైల్ అమ్మకాలు 0.8 శాతం అంచనాకు భిన్నంగా 0.4 శాతం మాత్రమే పెరగగా.. ఫ్యాక్టరీ ఉత్పత్తి వృద్ధి 5.3 శాతం అంచనాకు బదులుగా 4.8 శాతానికి పరిమితమైంది.
అంతేకాకుండా, స్థిర ఆస్తుల పెట్టుబడులు (Fixed Asset Investment) ఊహించని విధంగా తగ్గడం, బీజింగ్ ప్రకటించిన ఉద్దీపన చర్యల ప్రభావం ఇంకా క్షేత్రస్థాయికి చేరలేదనడానికి నిదర్శనమని ఏఎన్‌జెడ్ (ANZ) రీసెర్చ్ సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ డేనియల్ హైన్స్ విశ్లేషించారు. దీనికి తోడు.. ఎల్‌ఎంఈ నమోదిత గిడ్డంగుల్లో రాగి నిల్వలు ఆగస్టులో ఉన్న 2,05,000 టన్నుల నుండి సుమారు 3,20,000 టన్నులకు పెరగడం సరఫరా ఒత్తిడిని పెంచింది.
రెండవ ప్రధాన కారణం ఏంటంటే.. బలపడుతున్న అమెరికన్ డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్. డిసెంబర్ సమావేశంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు బలపడటంతో డాలర్ ఇండెక్స్ 103.4 స్థాయికి చేరగా, 10 సంవత్సరాల యూఎస్ ట్రెజరీ ఈల్డ్ 5.12%-5.14% వద్ద కొనసాగుతోంది. డాలర్ బలపడటం వల్ల ఇతర కరెన్సీల మదుపర్లకు రాగి కొనుగోలు వ్యయభరితంగా మారి డిమాండ్ తగ్గుతోందని పీఎల్ క్యాపిటల్ కమోడిటీస్ హెడ్ ఆశిష్ రాజోడియా వివరించారు.
మూడవ కారణం ఏంటంటే.. టెక్నాలజీ రంగంలో అమ్మకాల వెల్లువ. ఏఐ డేటా సెంటర్లు, విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో రాగి వినియోగం కీలకం కావడంతో.. టెక్ షేర్ల పతనం వల్ల మార్కెట్లో ఊహాజనిత దీర్ఘకాలిక అమ్మకాలు (Speculative Long Liquidation) పెరిగాయని సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో రాగి ధరల గమనం.. ప్రధానంగా అమెరికా ఫెడ్ విధానాలు, డాలర్ కదలికలు, చైనా నుండి వెలువడే అదనపు ఆర్థిక ఉద్దీపన చర్యలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. గురువారం విడుదల కానున్న యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశపు మినిట్స్‌పై మదుపర్లు ప్రత్యేక దృష్టి సారించారు. చైనా నుండి బలమైన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడటం లేదా డాలర్ బలహీనపడటం జరిగితే రాగి ధరలు తిరిగి కోలుకునే అవకాశం ఉందని.. లేనిపక్షంలో ఫెడ్ కఠిన వైఖరి కొనసాగితే ఈ పతనం మరింత కాలం పొడిగించవచ్చని ఆశిష్ రాజోడియా అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
