IPO News: సోలార్ కంపెనీ ఐపీవోకు BSE షాక్.. తెరుచుకోవటానికి రోజు ముందే వాయిదా, గ్రేమార్కెట్లో దూకుడు..
Solar91 Cleantech IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ప్రధానంగా ఈ ఏడాది చివరికి వచ్చిన వేళ దలాల్ స్ట్రీట్ ఐపీవోలతో మరింతగా బిజీగా మారిపోతోంది. అయితే మార్కెట్ రెగ్యులేటర్ మాత్రం ఎస్ఎమ్ఈ ఐపీవోలతో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకు నిర్థేశించిన వేళ తాజాగా మరో కంపెనీ ఐపీవోకు బ్రేకులు పడ్డాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సోలార్91 క్లీన్ టెక్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం నేడు తెరుచుకోనుంది. రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రారంభానికి ముందుగానే గ్రేమార్కెట్లో కంపెనీ షేర్ ఒక్కోటి రూ.100 ప్రీమియం కూడా పలికింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఐపీవో ప్రక్రియను తదుపరి నోటీసు ఇచ్చే వరకు నిలిపివేయాలని కంపెనీకి బీఎస్ఈ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన సోలార్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీవో ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. ఎలాంటి ఆటంకం లేకుండా ఐపీవో ముందుకు కొనసాగి ఉంటే ఇన్వెస్టర్లు తొలిరోజు 51 శాతం రాబడిని తమ పెట్టుబడిపై అందుకునే వారని గ్రేమార్కెట్ ప్రీమియం సూచించింది.

కంపెనీపై మీడియాలో ఫిర్యాదుదారులు లేవనెత్తిన కొన్ని ప్రశ్నల దృష్ట్యా, దీనికి తదుపరి విచారణ అవసరమని బీఎస్ఈ ఐపీవోను నిలిపివేస్తూ డిసెంబర్ 23న ప్రకటించింది. తదుపరి విచారణ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా టిక్రి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన ప్రశాంత్ జైన్, సిర్మా SGS టెక్నాలజీకి చెందిన కృష్ణ కుమార్ పంత్ వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.106 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇష్యూ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 24 నుంచి 27 వరకు షెడ్యూల్ చేయబడింది. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.185-195గా ఉంచింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1.17 లక్షలు పెట్టుబడిపెట్టాల్సి ఉంది.
కంపెనీ వ్యాపారం..
సోలార్91 క్లీన్ టెక్ 2015లో స్థాపించబడింది. దీనిని రాజస్థాన్ రాష్ట్రంలో నలుగురు ఐఐటియన్లు సౌరభ్ వ్యాస్, ప్రతీక్ అగర్వాల్, ధవల్ గౌరంగ్ వాసవాడ, సందీప్ గుర్నానీలు ప్రారంభించారు. కంపెనీ గ్రిడ్ కనెక్ట్ అండ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లను నిర్మాణంతో పాటు నిర్వహణను చేపడుతోంది. టర్న్‌కీ ఈపీసీ కాంట్రాక్టర్ ఈపీసీ మోడల్‌లో కంపెనీ దేశంలోని 13 రాష్ట్రాల్లో 191 ప్లాంట్‌లను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఆఫ్రికాలోని కెన్యాలోను ఒక ప్లాంటును ప్రారంభించటం గమనార్హం. అలాగే కంపెనీ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ మోడల్‌లో 2 ప్రాజెక్ట్‌లను స్థాపించింది. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 94 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించింది. పునరుత్పాదక ఇంధన మార్కెట్‌లో కస్టమర్‌లు, పెట్టుబడిదారులకు సేవ చేయడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతుంది.


Click it and Unblock the Notifications