కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విదేశీ మారక (ఫారెక్స్) మార్కెట్‌పై విధించిన కఠిన ఆంక్షలు భారత బ్యాంకింగ్ రంగంపై తక్షణ ప్రభావాన్ని చూపించాయి. సోమవారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ స్టాక్స్ 3 శాతం వరకు పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా ప్రస్తుత త్రైమాసికంలో రూ. 4 వేల కోట్ల వరకు మార్క్-టు-మార్కెట్ (MTM) నష్టాలు సంభవించవచ్చనే భయం ఈ అమ్మకాల వెనుక ప్రధాన కారణంగా నిలిచింది.
నిఫ్టీ బ్యాంక్ సూచీ సుమారు 2.5 శాతం పడిపోగా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు దాదాపు 3 శాతం వరకు నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా సుమారు 2 శాతం చొప్పున పడిపోయాయి. ఈ పతనం, ఆర్‌బిఐ కొత్తగా ప్రకటించిన నిబంధనల ప్రభావంగా భావిస్తున్నారు.

ఏప్రిల్ 10 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ నికర ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను ప్రతి పనిదినం ముగిసే సమయానికి 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. అనేక బ్యాంకులు 25 బిలియన్ డాలర్ల నుండి 50 బిలియన్ డాలర్ల వరకు ఉన్న ఆర్బిట్రేజ్ ట్రేడ్‌లను అన్‌వైండ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల మార్కెట్‌లో భారీ స్థాయిలో డాలర్ విక్రయాలు జరిగే అవకాశముంది.
విశ్లేషకుల అంచనాల ప్రకారం.. 30 నుండి 40 బిలియన్ డాలర్ల విలువైన ఓపెన్ పొజిషన్లపై రూపాయి-డాలర్ మారకంలో ప్రతి రూ.1 మార్పు వచ్చినా.. బ్యాంకింగ్ రంగానికి రూ.30 నుండి 40 బిలియన్ డాలర్ల (రూ.3,000-4,000 కోట్లు) వరకు నష్టం కలగవచ్చు. ఈ కారణంగా నాల్గవ త్రైమాసికంలో బ్యాంకుల లాభాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిలో ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్, ఆన్‌షోర్ మార్కెట్ మధ్య వ్యత్యాసం పెరిగితే, నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు ఆన్‌షోర్ మార్కెట్‌లో తక్కువ ప్రీమియంతో డాలర్లను కొనుగోలు చేసి.. ఆఫ్‌షోర్ మార్కెట్‌లో అధిక ప్రీమియంతో విక్రయించడం ద్వారా లాభాలు పొందుతాయి. కానీ ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితుల్లో ఈ వ్యూహం రిస్కీగా మారింది.
ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడిన అస్థిరత, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గడం వంటి అంశాలు ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. అయితే ఇటీవల రూపాయి కొంత కోలుకుని డాలర్‌కు 93.85 వద్ద ట్రేడవుతోంది. ఇది కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. ఇక బ్యాంకులు ఈ ఆంక్షలపై RBI నుండి ఉపశమనం కోరుతున్నాయి. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులకు మినహాయింపులు ఇవ్వడం, అమలు గడువును పొడిగించడం వంటి అంశాలను RBI పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా మాత్రం ఈ నష్టాలపై భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో రూపాయి బలహీనత కారణంగా బ్యాంకులు భారీ లాభాలు పొందినందున, ఇప్పుడు కొంత లాభం కోల్పోవడం సహజమని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications