స్టాక్ మార్కెట్ డేంజర్ బెల్స్.. కుప్పకూలిన ఆసియా షేర్ మార్కెట్లు.. చైనాలో ఆందోళనకరంగా నిరుద్యోగం..
Asian Financial Shock: అంతర్జాతీయ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలలో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడితో ఈ వారం ఆసియా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా జపాన్, తైవాన్ మార్కెట్లు చారిత్రక స్థాయిలో భారీ పతనాలను చవిచూశాయి. శుక్రవారం (నవంబర్ 20, 2026) ట్రేడింగ్‌లో జపాన్ బెంచ్‌మార్క్ టోపిక్స్ (Topix) సూచీ 3.9 శాతం క్షీణించగా.. చిప్ కంపెనీల వాటా అధికంగా ఉన్న నిక్కీ 225 (Nikkei 225) ఏకంగా 5.1 శాతం పతనమైంది.
టోపిక్స్ సూచీ వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టపోవడం డిసెంబర్ 2024 తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘమైన వరుస క్షీణతగా చెప్పుకోవచ్చు. ఈ వారం మొత్తంలో టోపిక్స్ 6.8 శాతం నష్టపోయి ఏప్రిల్ 2025 తర్వాత అత్యంత దారుణమైన వారపు పనితీరును నమోదు చేసింది. మరోవైపు ప్రపంచ చిప్ తయారీ కేంద్రమైన తైవాన్‌లో తైయెక్స్ (Taiex) సూచీ ఈ ఒక్క వారంలోనే 17.2 శాతం కుప్పకూలింది. 1991 తర్వాత తైవాన్ మార్కెట్‌కు ఇదే అత్యంత దారుణమైన వారంగా నిలిచింది.

ఈ అమ్మకాల సునామీలో ప్రధానంగా చిప్, టెక్నాలజీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. జపాన్‌లో శుక్రవారం ఒక్కరోజే సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, కియోక్సియా (Kioxia), ఇబిడెన్ (Ibiden) షేర్లు 11 శాతానికి పైగా పడిపోవడంతో వాటిలో పెట్టుబడులు పెట్టిన ఫండ్‌లు, అనుబంధ స్టాక్‌లు సైతం ప్రభావితమయ్యాయి. జూన్ 2026లో రికార్డు గరిష్ఠ స్థాయిని తాకిన జపాన్, నిక్కీ సెమీకండక్టర్ స్టాక్ ఇండెక్స్, అప్పటి నుండి క్రమంగా క్షీణిస్తూ నవంబర్ నాటికి తన గరిష్ఠ విలువలో దాదాపు 60 శాతం మేర ఆవిరైపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆసియా మార్కెట్ల ఈ భారీ పతనానికి విశ్లేషకులు నాలుగు ప్రధాన కారణాలను విశ్లేషిస్తున్నారు.
మొదటిది ఏంటంటే అమెరికా మార్కెట్లో ఎస్&పీ 500 దాదాపు 2 శాతం క్షీణించడంతో యూఎస్ టెక్ కంపెనీలలో మొదలైన అమ్మకాల సెగ జపాన్, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు పాకింది.
రెండవది ఏంటంటే.. ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ (Anthropic).. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ తర్వాత కనిపించిన ప్రారంభ ఉత్సాహం త్వరగానే మసకబారడంతో.. ఏఐ స్టాక్‌లలో మళ్లీ భారీ ర్యాలీ వస్తుందన్న మదుపర్ల అంచనాలు బలహీనపడ్డాయి.
మూడవది ఏంటంటే.. అక్టోబర్‌లో జపాన్ ద్రవ్యోల్బణం రేటు బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్దేశించిన 2 శాతం లక్ష్యాన్ని దాటి నమోదు కావడంతో, డిసెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే భయాలు పెరిగాయి. రేట్ల పెంపు వల్ల రుణ భారం పెరిగి కార్పొరేట్ ఆదాయాలు తగ్గుతాయని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.
నాలుగవది ఏంటంటే.. గతంలో అసాధారణ వేగంతో పెరిగిన చిప్ స్టాక్‌లలో ఇప్పుడు మదుపర్లు భారీగా లాభాల స్వీకరణకు (Profit Booking) దిగడంతో ఒక్కరోజులోనే 11 శాతానికి పైగా అమ్మకాలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఆసియా ఆర్థిక వ్యవస్థలపై ఆందోళనలను పెంచుతూ చైనాలో యువత నిరుద్యోగ రేటు గణాంకాలు వెలువడ్డాయి. చైనాలో 15 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువతలో నిరుద్యోగిత రేటు 1991లో కేవలం 4.4 శాతంగా ఉండగా, 2025 నాటికి అది ఏకంగా 15.8 శాతానికి ఎగబాకింది. మూడు దశాబ్దాల కాలంలో చైనా యువత నిరుద్యోగ రేటు సుమారు 3.6 రెట్లు (దాదాపు నాలుగు రెట్లు) పెరగడం ఆ దేశ ఆర్థిక మందగమనం, ఉపాధి కల్పన సవాళ్లను స్పష్టం చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
