Adani: అదానీపై కేసు కొట్టేసిన అమెరికా కోర్టు.. లాభాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్..!
గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసును యూఎస్ కోర్టు కొట్టివేసిన తర్వాత, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్ వంటి అదానీ గ్రూప్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మంగళవారం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 0.55% వరకు పెరిగి లాభాల బాట పట్టాయి. అదే సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు కూడా 0.42% వరకు పెరిగాయి. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను యూఎస్ కోర్టు 'విత్ ప్రెజుడిస్' పద్ధతిలో కొట్టివేసింది. దీంతో మోసం, లంచం ఆరోపణలపై దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విచారణకు ముగింపు పలికింది.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వీనీత్ ఎస్. జైన్‌లపై ఉన్న అభియోగాలను కొట్టివేయడానికి జస్టిస్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన రూల్ 48(ఎ) పిటిషన్‌ను న్యూయార్క్ తూర్పు జిల్లా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆమోదించింది. ఈ అభియోగాలలో సెక్యూరిటీల మోసానికి కుట్ర, వైర్ ఫ్రాడ్‌కు కుట్ర, సెక్యూరిటీల మోసం ఉన్నాయి. కేసును ఉపసంహరించుకోవాలన్న తమ నిర్ణయంపై ప్రాసిక్యూటర్ల నుంచి మరింత స్పష్టత కోరిన తర్వాత, న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్ ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 'విత్ ప్రిజుడిస్' (భవిష్యత్తులో మళ్లీ విచారణ జరగకుండా నిరోధించడం) అనేది క్రిమినల్ విచారణను శాశ్వతంగా ముగిస్తుంది.

ఈ కేసు నవంబర్ 2024 నాటిది. సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్ల డాలర్లు లంచాలు చెల్లించే పథకంలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వనీత్ జైన్, ఇతరులు పాల్గొన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ కాంట్రాక్టుల ద్వారా రెండు దశాబ్దాల కాలంలో పన్నుల తర్వాత $2 బిలియన్లకు పైగా లాభాలు వస్తాయని అంచనా వేశారు. అమెరికా మార్కెట్లలో రుణాలు, బాండ్ల జారీ ద్వారా ఈ గ్రూప్ $3 బిలియన్లకు పైగా నిధులను సమీకరించారు. పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని కూడా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
న్యాయ ప్రక్రియ పట్ల ప్రగాఢమైన గౌరవం ఉందని అదానీ చెప్పారు. సవాలుతో కూడిన కాలమంతటా, సత్యం, నిష్పక్షపాతం, చట్టబద్ధమైన పాలనపై తమ విశ్వాసం చెక్కుచెదరలేదని అన్నారు. తమపై, వ్యవస్థపై, న్యాయం అందించడంలో భారతదేశ సామర్థ్యంపై విశ్వాసం కోల్పోని వారికి కృతజ్ఞతలు చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications