జోహో ఉద్యోగుల తొలగింపు: ఆ 300 మందికి ఏం జరిగింది?
శ్రీధర్ వెంబు స్థాపించిన జోహో, ఇండియాలోనే పుట్టి వేగంగా ఎదుగుతున్న ఓ ప్రముఖ ఐటీ సేవల సంస్థ. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల ఉత్పత్తులకు గట్టి పోటీనిస్తూ జోహో ఎన్నో సేవలను అందిస్తోంది.
గతేడాది చాలా మంది కేంద్ర మంత్రులు సైతం జీమెయిల్‌కు బదులుగా జోహో మెయిల్‌ను వాడటం మొదలుపెట్టారు. దీంతో, భారతదేశంలో అత్యంత నమ్మకమైన సంస్థల్లో ఒకటిగా జోహో పేరు తెచ్చుకుంటోంది. దీని వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చెప్పే ప్రతి మాటా లక్షల మందికి చేరుతుంది. ఈ కంపెనీ చాలా ఏళ్లుగా 'నో లేఆఫ్' (No layoff) పాలసీని పాటిస్తోంది.
ఇలాంటి సమయంలో, జోహో కంపెనీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 300 మంది ఉద్యోగులను తొలగించిందంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. 'బ్లైండ్ యాప్' (Blind App) అనే యాప్‌లో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. "జోహో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 300 మంది ట్రైనీలను ఉన్నపళంగా ఉద్యోగంలోంచి తీసేసింది. నేను టీసీఎస్, క్యాప్‌జెమినీ లాంటి కంపెనీలను కాదని జోహోను ఎంచుకున్నాను. కానీ వాళ్లు ఇలా చేశారు" అని ఆ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

"జోహోలో ఉద్యోగం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ వేరే కంపెనీలో చేరి ఉంటే కనీసం నా ఉద్యోగానికి ఒక భద్రత ఉండేదేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. నా కుటుంబాన్ని నేనే పోషించాలి. వాళ్లు ఉన్నట్టుండి ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు" అని ఆ ఉద్యోగి వాపోయారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. దీంతో Zoho సంస్థ ఈ విషయంపై స్పందించి వివరణ ఇచ్చింది. "మా కంపెనీ చాలా కాలంగా 'నో లేఆఫ్' పాలసీని పాటిస్తోంది. మేం మా ఉద్యోగులు ఎవరినీ లేఆఫ్ చేయం" అని స్పష్టం చేసింది. తమ సంస్థలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదని తేల్చిచెప్పింది.
ఈ విషయంపై కంపెనీ హెచ్‌ఆర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ముహమ్మద్ సోహైల్ మాట్లాడుతూ.. "మా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు, పూర్తిస్థాయి ఉద్యోగానికి మధ్య ఉన్న తేడా తెలియక ఈ పోస్ట్ పెట్టినట్టున్నారు" అని అన్నారు. "ఇంటర్న్‌షిప్‌లో పని నేర్పిస్తాం అంతేగానీ, ఆ తర్వాత వాళ్లను కచ్చితంగా పూర్తిస్థాయి ఉద్యోగిగా తీసుకుంటామని ఎలాంటి హామీ ఇవ్వం" అని ఆయన స్పష్టం చేశారు.
"2026 సంవత్సరంలో మా కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసిన వారిలో 30 శాతం మంది ఇప్పటికే పూర్తిస్థాయి ఉద్యోగులుగా మారారు" అని ఆయన తెలిపారు. "ఇంటర్న్‌షిప్ కాలం ముగిసిన వారిని 'లేఆఫ్' చేశారని చెప్పడం సరికాదు" అని ఆయన వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications