ఇండియాలో టెక్ ఉద్యోగులకు మరో బిగ్ షాక్.. క్వాల్‌కామ్‌లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులపై వేటు..
Qualcomm Job Cuts: ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం, స్మార్ట్‌ఫోన్ చిప్‌లకు డిమాండ్ తగ్గడం, అంతర్గత పునర్వ్యవస్థీకరణ (Restructuring) పేరుతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు నిర్వహిస్తున్న ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ 'క్వాల్‌కామ్' (Qualcomm) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిని తగ్గించుకునే చర్యలను వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా భారతదేశంలో నివసిస్తున్న సుమారు వేయి మందికి పైగా ఇంజనీర్లు, టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్నారు. అమెరికాలో తొలగింపులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే.. సోమవారం బెంగళూరులోని క్వాల్‌కామ్ ప్లాంట్‌లో మొదటి విడత ఉద్యోగ కోతలు మొదలయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 52 వేల మంది క్వాల్‌కామ్ ఉద్యోగులలో దాదాపు 7 శాతం మందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా వెలుపల క్వాల్‌కామ్‌కు భారతదేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి (R&D) సంస్థ ఉంది. మన దేశంలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సిఆర్, చెన్నైలలో కంపెనీకి ప్రధాన ఆర్&డి సెంటర్లు ఉండగా, మొత్తం 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
గ్లోబల్ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే.. ఒక్క భారతదేశంలోనే వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. వృత్తిపరమైన అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లతో పాటు కొత్తగా చేరిన ఫ్రెషర్లపై కూడా ఈ వేటు పడుతోంది. పైగా, రాబోయే జనవరి నెలలో రెండవ విడత ఉద్యోగ కోతలు కూడా ఉండే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామంపై క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ స్పందిస్తూ.. దీనిని కేవలం "పనితీరు ఆధారిత తగ్గింపు" (Performance-based reduction) గా అభివర్ణించారు. అయితే, తొలగింపునకు గురైన ఉద్యోగులు మాత్రం తమకు ముందుగా ఎలాంటి పర్‌ఫార్మెన్స్ ఫీడ్‌బ్యాక్ లేదా ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండానే అకస్మాత్తుగా ఊడబెరికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు వారి సేవా కాలాన్ని బట్టి 3 నెలల వేతనాన్ని లేఆఫ్ ప్యాకేజీగా అందిస్తున్నారని.. మూడు రోజుల్లోగా విరమణ పత్రాలపై సంతకం చేసే వారికి అదనంగా మరో నెల జీతం ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్ రంగానికి తగ్గిన డిమాండే. క్వాల్‌కామ్ ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించిన లాభాలను సాధించినప్పటికీ, స్మార్ట్‌ఫోన్ చిప్‌లకు డిమాండ్ తగ్గడం మరియు మెమరీ ధరలు పెరగడంతో భవిష్యత్తు ఆదాయ అంచనాలను (Revenue Guidance) తగ్గించుకుంది. గ్లోబల్‌గా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మందగించడం కంపెనీపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.
ప్రస్తుతం గ్లోబల్ టెక్ రంగంలో క్వాల్‌కామ్ మాత్రమే కాదు, అనేక దిగ్గజ సంస్థలు వ్యయ నియంత్రణ పేరిట లేఆఫ్స్ బాట పట్టాయి. ఇటీవల గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), మెటా (Meta), మరియు ఇంటెల్ (Intel) వంటి సంస్థలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోని ప్రముఖ ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు కూడా కొత్త నియామకాలను తగ్గిస్తూ, బెంచ్ నిరీక్షణ కాలాన్ని కుదిస్తూ వ్యయ భారాలను తగ్గిస్తున్నాయి. ఈ వరుస తొలగింపుల పరిణామాలు భారతీయ ఐటీ, టెక్ నిపుణులలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.


Click it and Unblock the Notifications
