భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన 'ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్' (PM internship) యువతకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించిన ఈ పథకం ద్వారా, దేశంలోని ప్రముఖ కంపెనీల్లో యువతకు పరిశ్రమ అనుభవం (Industry Exposure) లభిస్తుంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి నైపుణ్యాలను పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
అధికారిక మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ (ITI), డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రస్తుతం పూర్తి కాలం విద్యా కోర్సులు చదువుతున్న వారు లేదా పూర్తి కాలం ఉద్యోగం చేస్తున్న వారు దీనికి అర్హులు కారు. అయితే, ఆన్‌లైన్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా చదువుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కాలపరిమితి ఎంత?
ఈ ఇంటర్న్‌షిప్ గరిష్టంగా 12 నెలల పాటు ఉంటుంది. ఇందులో కనీసం 50% సమయాన్ని అసలైన పని ప్రదేశంలో (Workplace) గడపాల్సి ఉంటుంది. దీనివల్ల కేవలం థియరీ కాకుండా, ప్రాక్టికల్ అనుభవం లభిస్తుంది.
ఏయే రంగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుంది?
మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లోని అగ్రగామి కంపెనీలు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్నాయి.
స్టైఫెండ్ తో ఫాటు బెనిఫిట్స్ కూడా..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 స్టైపెండ్ అందుతుంది.
- ఇందులో రూ. 4,500 కేంద్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాకు (DBT) పంపిస్తుంది.
- మిగిలిన రూ. 500 సంబంధిత కంపెనీ అందజేస్తుంది.
- ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు ఒకేసారి రూ. 6,000 గ్రాంట్‌గా ఇస్తారు.
- ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కల్పిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..
అధికారిక PMIS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రిజిస్టర్ చేసుకుని, తమ ప్రొఫైల్‌ను పూర్తి చేయాలి. అత్యాధునిక టెక్నాలజీ ఆధారిత మ్యాచింగ్ సిస్టమ్ ద్వారా అభ్యర్థుల అర్హతలకు తగిన ఇంటర్న్‌షిప్ అవకాశాలను కేటాయిస్తారు.
పీఎం ఇంటర్న్‌షిప్ (PM internship) లక్ష్యం ఇదే..
దేశంలో నైపుణ్యం కలిగిన యువ శక్తిని తయారు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఆర్థిక మద్దతుతో పాటు నిజమైన పని వాతావరణంలో అనుభవం కల్పించడం ద్వారా, యువతను ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో లక్షలాది మందికి ఈ అవకాశాన్ని కల్పించడం ద్వారా నిరుద్యోగితను తగ్గించి, యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేయడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.
మొత్తంగా చెప్పాలంటే, సరైన పని అనుభవం లేక ఇబ్బంది పడే నిరుద్యోగ యువతకు ఈ ఇంటర్న్ షిప్ (PM internship) ఒక గొప్ప మెట్టు. దీని ద్వారా పొందే శిక్షణ భవిష్యత్తులో స్థిరమైన ఉద్యోగాన్ని సాధించడంలో ఎంతో తోడ్పడుతుంది.


Click it and Unblock the Notifications