పొద్దున్నే వర్చువల్ కాల్.. కట్ చేస్తే 600 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..ముందస్తు సమాచారం లేకుండా తీసేసిన PayPal
PayPal Layoffs: అమెరికన్ ఫిన్‌టెక్ దిగ్గజం 'పేపాల్' (PayPal) తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారతదేశంలోని పలు బృందాల్లో భారీగా ఉద్యోగులను తొలగించింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని సాంకేతిక, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితమయ్యారు.
అయితే భారతదేశంలో జరిగిన ఉద్యోగ కోతల సంఖ్యపై కంపెనీ యాజమాన్యానికి.. ఇతర వర్గాల సమాచారానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. భారత కార్యకలాపాల నుంచి దాదాపు 600 మంది (మొత్తం ఉద్యోగులలో 10 శాతం) సిబ్బందిని తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలుపగా.. కంపెనీ ప్రతినిధి ఆ గణాంకాలను ఖండించారు. ఆగస్టు 31 నాటికి సుమారు 220 మంది (భారత్‌లోని మొత్తం 6,000 మంది సిబ్బందిలో 4 శాతం) ఉద్యోగులు మాత్రమే తగ్గారని కంపెనీ వెల్లడించింది.
బాధిత ఉద్యోగుల కథనం ప్రకారం.. వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సోమవారం ఉదయం సడన్‌గా వర్చువల్ కాల్‌లో చేరాలని ఆదేశించారు. ఆ కాల్ ముగిసిన వెంటనే సిస్టమ్ యాక్సెస్‌ను రద్దు చేసి, అనంతరం లేఆఫ్ ఇమెయిల్స్ పంపారు. ఉద్యోగ విరమణ పరిహారంగా ఒక నెల జీతం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పూర్తి పరిష్కారానికి (Full & Final Settlement) సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంకా అందలేదని బాధితులు పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వృద్ధి, ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను సరళీకృతం చేసేందుకు గతంలో ప్రకటించిన బహుళ-సంవత్సరాల ప్రణాళికలో భాగమే ఈ నిర్ణయమని పేపాల్ ప్రతినిధి స్పష్టం చేశారు. రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో తన అంతర్జాతీయ ఉద్యోగుల సంఖ్యలో 20 శాతం (సుమారు 4,760 ఉద్యోగాలు) తగ్గించడం ద్వారా కనీసం $1.5 బిలియన్ల పొదుపు సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఆధారంగానే ఐర్లాండ్‌లో కూడా 164 మందిని (12 శాతం) తొలగించారు.

కాగా, అమెరికా వెలుపల పేపాల్‌కి చెందిన అతిపెద్ద టెక్నాలజీ హబ్‌లలో భారతదేశం ఒకటి. 2008లో చెన్నైలో మొదటి అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన పేపాల్, తదనంతరం బెంగళూరు, హైదరాబాద్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
రెండు రోజు క్రితం ప్రముఖ రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబెర్ (Uber) తమ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 3,300 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2020 పాండెమిక్ తర్వాత ఉబెర్ చేపట్టిన అతిపెద్ద లేఆఫ్స్ ఇవే కావడం గమనార్హం. సంస్థలో నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, నిపుణులైన బృందాల నిర్మాణం కోసం మేనేజ్‌మెంట్ పొరలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు తెలిపారని సమాచారం. ఈ చర్యల్లో భాగంగా మేనేజర్ల సంఖ్యను 20 శాతం వరకు తగ్గించారు.
ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆపరేషన్స్ మరియు మేనేజ్‌మెంట్ టీమ్‌లతో పాటు పలు చిన్న మైక్రో-టీమ్‌ల పై ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది.భారతదేశంలోని ఉబెర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కూడా ఈ ఉద్యోగాల కోతకు గురయ్యారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలను కూడా ఉబెర్ కఠినతరం చేసింది. రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశించింది. భవిష్యత్తులో కేవలం 1 శాతం మందికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉంటుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications
