ఒరాకిల్ లేఆఫ్స్.. 20 వేల మంది సీనియర్ ఉద్యోగులు ఔట్.. దారుణంగా ఫ్రెషర్ల పరిస్థితి..
టెక్ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ ప్రకటించిన తాజా లేఆఫ్స్ టెక్ రంగాన్ని నివ్వెరపరిచాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 వేల నుంచి 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ నిర్ణయించడం, టెక్ ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతోంది. అమెరికా, ఇండియా, కెనడా, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్న ఒరాకిల్ కార్యాలయాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. సోమవారం ఉదయం ఉద్యోగులకు అందిన ఈ-మెయిల్స్ వారి భవిష్యత్తును ఒక్కసారిగా ప్రశ్నార్థకం చేశాయి.
ఈ లేఆఫ్స్‌లో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. కంపెనీ కేవలం ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, అత్యంత అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులను సైతం లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగా, ఒరాకిల్‌లో 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నీనా లివిస్ వంటి సీనియర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. 1990లో సంస్థలో చేరి, డేటాబేస్, ఎథికల్ హ్యాకింగ్, సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిపుణులను కూడా వదులుకోవడం, కంపెనీ ప్రాధాన్యతలు ఏ విధంగా మారుతున్నాయో తెలియజేస్తోంది. కృత్రిమ మేధ (AI) ప్రభావం వల్ల సీనియర్ల స్థానాలు ప్రమాదంలో పడ్డాయని నీనా లివిస్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో చర్చనీయాంశమైంది.

Oracle మాత్రమే కాకుండా మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ వంటి ఇతర దిగ్గజ సంస్థలు కూడా గత కొంతకాలంగా భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ ఇప్పుడు "ఏఐ ఫస్ట్" అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. అంటే, పనులను ఆటోమేట్ చేయడం ద్వారా మానవ వనరుల అవసరాన్ని తగ్గించుకోవడమే వీటి ప్రధాన లక్ష్యం. తక్కువ పెట్టుబడితో, తక్కువ మంది ఉద్యోగులతో అధిక లాభాలను ఆర్జించాలనే కార్పొరేట్ ధోరణి పెరిగింది. ఈ క్రమంలోనే భారీ వేతనాలు తీసుకునే సీనియర్ల కంటే, ఏఐ సాంకేతికతను వాడుకుంటూ తక్కువ జీతానికి పనిచేసే యువ ఉద్యోగుల వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
ఈ మార్పుల వల్ల కొత్తగా పట్టభద్రులైన ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకప్పుడు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు విరివిగా లభించేవి, కానీ ఇప్పుడు ఆ పనులన్నీ ఆటోమేషన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. టాప్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తగ్గించడమే కాకుండా, అత్యవసరమైతే తప్ప కొత్తవారిని తీసుకోవడం లేదు. దీంతో నిన్నటి వరకు సురక్షితమని భావించిన మేనేజర్, డైరెక్టర్ స్థాయి ఉద్యోగాలు కూడా ఇప్పుడు గ్యారెంటీ లేకుండా పోయాయి. విద్యా సంస్థలు సైతం ఇప్పుడు 100 శాతం ఉద్యోగ హామీ ఇవ్వలేకపోతున్నాయి.
ఒరాకిల్ తన వ్యాపారాన్ని క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైపు మళ్లించుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా తన వర్క్‌ఫోర్స్‌ను పూర్తిగా పునర్నిర్మించుకుంటోంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, పాత తరం నైపుణ్యాల కంటే ఆధునిక ఏఐ నైపుణ్యాలకు విలువ పెరుగుతోంది. అయితే, దశాబ్దాల కాలం కంపెనీ ఎదుగుదల కోసం శ్రమించిన నిపుణులను ఇలా హఠాత్తుగా తొలగించడం శోచనీయం. లాభాలే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఉద్యోగ భద్రత అనేది నేడు ఒక మిథ్యగా మారుతోంది. టెక్ నిపుణులు తమను తాము నిరంతరం అప్‌డేట్ చేసుకుంటే తప్ప, ఈ పోటీ ప్రపంచంలో మనుగడ సాగించడం కష్టతరంగా మారుతోంది.


Click it and Unblock the Notifications
