Wipro Latest News: ఐటీ పరిశ్రమకు భారత్ పెట్టింది పేరు. వాస్తవానికి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ప్రపంచ దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మళ్లగా.. ఇండియా మాత్రం డైరెక్టుగా సర్వీస్ సెక్టార్‌లోకి అడుగుపెట్టింది. అందుకే ప్రపంచానికి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఐటీ సేవలను అందించటంలో భారతీయ ఐటీ పరిశ్రమ ముందు వరుసలో ఉంది. దీనికి మరో కారణం ఇక్కడ నైపుణ్యాలు కలిగిన యువత ఎక్కువగా అందుబాటులో ఉండటం కూడా అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం భారతీయ ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తిరిగి పుంజుకుంటున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగుల నియామకాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో ప్రస్తుతం కొత్తగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దీనికింద దేశంలోని టాప్ కాలేజీల్లోని టాలెంట్ బీటెక్ విద్యార్థుల కోసం దీనిని తీసుకొచ్చింది. దీనికింద ఎంపికైన బీటెక్ విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్లో పనిచేయటానికి సులువుగా అవకాశం పొందుతారని కంపెనీ వెల్లడించింది. టర్బో హైరింగ్ ప్రోగ్రామ్ 2025 కింద ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక వెసులుబాటు కల్పించబడుతోంది.

ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికయ్యే విద్యార్థులు ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశంతో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీస్‌పై పనిచేస్తూ సర్టిఫికెట్లు పొందుతారని కంపెనీ పేర్కొంది. అలాగే ఎంపికైన విద్యార్థుల ఉన్నత విద్యకోసం విప్రో స్కాలర్‌షిప్ కూడా ఆఫర్ చేస్తోంది. ఇక్కడ ఎంపికకు అవసరమైన విద్యార్హతలను పరిశీలిస్తే.. 2025లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. అలాగే 10, 12వ తరగతుల్లో కనీసం 60 శాతం మార్కులు, డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరిగా పేర్కొనబడింది. 10వ తరగతికి, డిగ్రీ స్టార్ట్ చేయడానికి మధ్యలో గరిష్టంగా మూడేళ్ల గ్యాప్ మాత్రమే అంగీకరించబడుతోంది. అలాగే ఒక బ్యాక్ లాగ్ ఉన్నప్పటికీ పర్వాలేదని పేర్కొంది.
మెుత్తం మీద అర్హతలను అందుకుని విప్రో ప్రోగ్రామ్ కింద ఎంపికైన విద్యార్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్ల రోల్ కింద తీసుకోబడతారు. ఇక వీరికి అందిస్తున్న వేతనం గురించి పరిశీలిస్తే.. ముందుగా రూ.5.5 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో పాటు లక్ష రూపాయలు రిటెన్షన్ బోనస్ కూడా అందించబడుతోంది. ఇదే క్రమంలో కంపెనీ ఉద్యోగులకు అందించే మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అలాగే ఫుల్ టైమ్ ఉద్యోగి మాదిరిగానే పీఎఫ్, గ్రాట్యుటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది.
ఇక ఎంపికైన విద్యార్థులు ఖచ్చితంగా ఏడాది సర్వీస్ అగ్రిమెంట్ కింద ఒప్పందంపై సంతకం చేయాల్సిందేనని కంపెని స్పష్టం చేసిందే. దీని కింద ఎవరైనా గడువుకు ముందు జాబ్ మానేస్తే వారు రూ.75 వేల వరకు జరిమానాగా కట్టాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికోసం ముందుగా కంపెనీ వెబ్ సైట్ లో ఫారమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications