ఏఐ ఉద్యోగాలు: ఐటీ కంపెనీల మాయాజాలం! నిజం తెలిస్తే షాక్ అవుతారు
ఏఐ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు వస్తాయని ఐటీ కంపెనీలు చెబుతున్నా... జరుగుతోంది వేరేలా ఉంది. పాత ఉద్యోగాలకే 'ఏఐ' స్టిక్కర్ అంటించి కొత్తవిగా చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐటీ సేవల రంగంలో ఏఐ వాడకం పెరిగితేనే ఈ టెక్నాలజీ విస్తరిస్తుందని అందరూ అంటున్న మాట. ఇదే అదనుగా, ఏఐ మోడల్ కంపెనీలు భారీ ఆఫర్లతో పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
ఇలాంటి తరుణంలోనే, దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు తమ పాత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్, బిజినెస్ అనలిటిక్స్ ఉద్యోగాలకు 'ఏఐ' అని పేరు మార్చి కొత్త జాబ్స్‌గా ప్రకటిస్తున్నాయి.
దీనివల్ల భారత ఐటీ రంగంలో నిజమైన ఏఐ ఆధారిత ఉద్యోగాలు సృష్టించడం కష్టంగా మారింది. ఇది 300 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ సేవల రంగానికి పెద్ద సవాలుగా పరిణమించింది.

ఇటీవల భారత ఐటీ కంపెనీలు ఏఐ ఏజెంట్లను ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో టీసీఎస్ 8900 మంది 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్లను' సిద్ధం చేసే పనిలో ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా 6000 మంది 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్లను' నియమించుకుని, కంపెనీలోనూ, క్లయింట్లకు అందించే సేవల్లోనూ ఏఐ వాడకాన్ని పెంచాలని ప్లాన్ చేస్తోంది.
అయితే, ఈ ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని ఐటీ నిపుణులు, స్టాఫింగ్ కంపెనీల ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 'Wanted' అని ప్రకటించిన చాలా ఉద్యోగాల వివరాల్లో ఏఐ, దానికి సంబంధించిన పదాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి సాధారణ సాఫ్ట్‌వేర్, డేటా, క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ పనులేనని బెర్న్‌స్టెయిన్ (Bernstein) నివేదిక స్పష్టం చేస్తోంది.
భారత్‌లోని టాప్ 5 ఐటీ కంపెనీలు ప్రస్తుతం 3500కు పైగా ఏఐ ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నాయి. ఈ పోస్టులు ఎక్కువగా టెక్నికల్ లీడ్, ఏఐ కంటెంట్ అనలిస్ట్, జెన్‌ఏఐ కన్సల్టెంట్ వంటి పేర్లతో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
భారత అగ్రగామి ఐటీ కంపెనీలలో ఏఐ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా, టీసీఎస్‌లో 604, ఇన్ఫోసిస్‌లో 1340, హెచ్‌సీఎల్‌టెక్‌లో 1376, విప్రోలో 350కి పైగా ఏఐ సంబంధిత ఖాళీలు ఉన్నాయి. టెక్ మహీంద్రా ప్రకటించిన 61 ఉద్యోగాల్లో 29 ఏఐకి సంబంధించినవే.
అయితే, ఈ ఉద్యోగాల్లో చేయాల్సిన పనులు సాధారణ ఐటీ ఉద్యోగులు చేసేవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, కేవలం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి, మార్కెట్లో తమ పేరు నిలబెట్టుకోవడానికే ఐటీ కంపెనీలు పాత ఉద్యోగాలకు ఏఐ పేరుతో నియామకాలు జరుపుతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.


Click it and Unblock the Notifications
