భారత ఐటీ రంగంలో కీలకమైన మార్పు కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కొనసాగిన నియామకాల నిలిపివేత (Recruitment Freeze) తర్వాత.. దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా మళ్లీ నియామకాలను ప్రారంభించాయి.గతేడాదిలో ఈ ఐదు సంస్థలు కలిపి సుమారు 2,505 మంది కొత్త ఉద్యోగులను తమ సంస్థల్లోకి తీసుకున్నాయి. 2024లో కోవిడ్ సమయంలో అధికంగా పెరిగిన ఉద్యోగ బలాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించగా.. 2025లో ఆ ధోరణిలో స్వల్ప మార్పు కనిపిస్తోంది.
అయినప్పటికీ ఈ నియామకాలు పెద్ద సంఖ్యలో జరగడం లేదు. భారత IT పరిశ్రమ మొత్తం విలువ సుమారు 283 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి మాత్రం ఇంకా పాత స్థాయికి చేరలేదు. కోవిడ్ తర్వాత ఐటీ ప్రాజెక్టుల స్వరూపం పూర్తిగా మారింది. పెద్ద, దీర్ఘకాల ప్రాజెక్టుల స్థానంలో ఇప్పుడు చిన్న కాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాల్సిన అవసరం లేకుండా, అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారినే ఎంపిక చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం భారత ఐటీ హైరింగ్ ప్రధానంగా నిచ్ స్కిల్స్ (ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు) పై కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, డెవ్‌ఆప్స్, ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీనికి విరుద్ధంగా, సంప్రదాయ లెగసీ టెక్నాలజీల్లో నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ సంస్థలు తెలిపిన ప్రకారం.. లెగసీ స్కిల్స్‌కు డిమాండ్ ఇప్పుడు 10 శాతం కంటే తక్కువగా ఉంది.
ఈ మార్పు వెనుక ప్రధాన కారణం కంపెనీల వ్యూహాత్మక ఆలోచన. ఇప్పుడు సంస్థలు ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవడం కంటే..తక్కువ మంది లేదా అధిక నైపుణ్యం కలిగిన టాలెంట్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. దీని వల్ల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. అలాగే ఖర్చులు నియంత్రణలో ఉంటాయి, అలాగే షేర్‌హోల్డర్లకు మెరుగైన లాభాలు అందుతాయని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.
2025లో ఐటీ కంపెనీల్లో ఎట్రిషన్ రేటు కూడా కొంత తగ్గింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రోలో ఉద్యోగులు సంస్థలను వదిలి వెళ్లే రేటు గత ఏడాదితో పోలిస్తే 0.8 నుంచి 1.4 శాతం వరకు తగ్గింది. ఇది ఉద్యోగ భద్రతపై కొంత నమ్మకం పెరుగుతోందనే సంకేతంగా పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. అయితే, TCS, టెక్ మహీంద్రాలో మాత్రం స్వల్పంగా ఎట్రిషన్ పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఏదేమైనా.. భారత ఐటీ రంగంలో హైరింగ్ ఫ్రీజ్ ముగిసినప్పటికీ అది అందరికీ వర్తించే విధంగా లేదు. నియామకాలు జరుగుతున్నాయి కానీ అవి పూర్తిగా నైపుణ్యాల ఆధారంగానే ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం 6 నుంచి 8 శాతం మధ్యస్థ వృద్ధి మాత్రమే సాధిస్తుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో, కంపెనీలు మరింత జాగ్రత్తగా, అవసరానికి తగ్గట్టుగా నియామక విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ మార్పులు భవిష్యత్ ఐటీ ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చే దిశగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications