అమెరికాలో ఈ ఉద్యోగాలకే ఇప్పుడు పుల్లు డిమాండ్..అది కొంచెం నేర్చుకుంటే రూ. లక్షల్లో జీతాలు
లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబ్స్ ఆన్ ది రైజ్ - 2026 నివేదిక.. ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో జరుగుతున్న మౌలిక మార్పులను స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం ఉద్యోగాల స్వరూపాన్నే కాదు.. ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని కూడా సమూలంగా మార్చుతోంది. ఒకప్పుడు కొన్ని సాంకేతిక రంగాలకే పరిమితమైన ఆటోమేషన్, ఇప్పుడు దాదాపు ప్రతి పరిశ్రమలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ నివేదికలో వెల్లడైన గణాంకాలు ఆలోచనలకు దారితీసేవిగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగానికి పైగా, అంటే సుమారు 56 శాతం మంది, 2026లో ఉద్యోగం మార్చుకోవాలని యోచిస్తున్నారని లింక్డ్ఇన్ పేర్కొంది. అదే సమయంలో 76 శాతం మంది ఉద్యోగులు రాబోయే కాలంలో అవసరమయ్యే నైపుణ్యాలకు తాము పూర్తిగా సిద్ధంగా లేమని భావించడం ఆందోళనకరమైన విషయంగా చెప్పవచ్చు. ఈ అస్థిరతకు ప్రధాన కారణం AI వేగంగా విస్తరించడం, సంప్రదాయ ఉద్యోగ నైపుణ్యాలు త్వరగా తమ ప్రాభవాన్ని కోల్పోవడంగా చెప్పవచ్చు.

AI ప్రభావంతో ఉద్యోగ మార్కెట్‌లో కొత్త రకాల పాత్రలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సంస్థలు ఇప్పుడు కేవలం టెక్నాలజీ వినియోగం కాకుండా, దానిని వ్యూహాత్మకంగా ఎలా అమలు చేయాలన్న దానిపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో AI ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, డేటా నిపుణులు, పరిశోధకులు వంటి ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇవి కేవలం కోడింగ్‌కే పరిమితం కాకుండా, వ్యాపార అవసరాలకు అనుగుణంగా AIని మలచగల సామర్థ్యాన్ని కోరుకుంటున్నాయి.
అయితే ఈ మార్పు పూర్తిగా టెక్నాలజీకే పరిమితం కాలేదు. లింక్డ్ఇన్ నివేదిక ప్రకారం.. అమెరికాలో గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా హ్యూస్టన్, డల్లాస్ వంటి నగరాల్లో కొత్త ఇళ్ల విక్రయాలు.. నిర్మాణ కార్యకలాపాలు పెరగడంతో సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీని వల్ల AIతో సంబంధం లేని రంగాల్లో కూడా అవకాశాలు కొనసాగుతున్నాయన్న సంకేతం కనిపిస్తోంది.
అమెరికాలో ఈ ఏడాది డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే..
AI ఇంజనీర్‌లు: ప్రిడిక్టివ్ మోడల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందిస్తారు.
AI కన్సల్టెంట్లు : సంస్థలు AIని ఎలా వినియోగించాలి, ఏ విభాగంలో ఆటోమేషన్ అవసరం అనే అంశాలపై వ్యూహాత్మక సలహాలు ఇస్తారు.
డేటా అన్నోటేటర్లు : AI శిక్షణ కోసం డేటాను శుద్ధి చేయడం, ట్యాగ్ చేయడం వంటి కీలక పనులు చేస్తారు.
AI / ML పరిశోధకులు : కొత్త అల్గారిథమ్‌లు, మోడల్స్‌ను అభివృద్ధి చేస్తూ భవిష్యత్ టెక్నాలజీకి పునాది వేస్తారు.
ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న అనిశ్చితి మరో ముఖ్యమైన మార్పుకు దారితీస్తోంది. చాలామంది నిపుణులు ఒకే సంస్థపై ఆధారపడటం కన్నా, తమ నైపుణ్యాలను స్వతంత్రంగా వినియోగించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. కన్సల్టింగ్, ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి వైపు మొగ్గు పెరుగుతోంది. ఒక కంపెనీపై ఆధారపడకుండా.. వ్యక్తిగత నైపుణ్యాలే భవిష్యత్తు భద్రతగా మారుతున్నాయి.
ఈ మార్పులన్నింటి మధ్యలో లింక్డ్ఇన్ నివేదిక ఇచ్చే ప్రధాన సందేశం స్పష్టంగా ఉంది. ఇకపై డిగ్రీ ఒక్కటే ఉద్యోగ భవిష్యత్తును నిర్ధారించదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. AIని భయంగా చూడకుండా.. దాన్ని నేర్చుకుని, దానితో కలిసి పనిచేసే విధానాన్ని అలవరుచుకున్నవారే రాబోయే కాలంలో ఉద్యోగ మార్కెట్‌లో నిలదొక్కుకుంటారు.
2026 ఉద్యోగ ప్రపంచం అనిశ్చితితో నిండినదిగా కనిపించినా.. అదే సమయంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచిన దశలో ఉంది. మార్పును అంగీకరించి,నేర్చుకునే వారికే ఈ AI యుగం నిజమైన అవకాశాలను అందించనుంది.


Click it and Unblock the Notifications


