GM Lay Offs: భారీగా ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్.. వారి స్థానంలో రోబోల ఏర్పాటు
ఏఐ రాకతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాగే రోబో టెక్నాలజీ వల్ల కూడా ఉద్యోగాలు పోతున్నాయి. తాజాగా ఆటో మొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్(GM) 1000 మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఉద్యోగుల స్థానంలో 50 రోబోలను ప్రవేశపెట్టింది. డెట్రాయిట్ అసెంబ్లీ ప్లాంట్ లో పని చేస్తున్న ఉద్యోగులను తీసేసి సహకార రోబోట్లు(కోబోట్లు) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ రోబోలు అసెంబ్లీ లైన్ లో వాహన బాడీ ప్యానెల్లు అమర్చడానికి మిగిలిన సిబ్బందితో కలిసి పని చేయనున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి, ఆటోమోషన్ లో భాగంగా కంపెనీ రోబోటిక్ యూనిట్లను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీల పోటీని తట్టుకోవడానికి, కార్మికుల భద్రత కోసం రోబోలు తీసుకొచ్చామని కంపెనీ పేర్కొంది. తమ కార్యకలాపాలలో మరింత అధునాతన సాంకేతికతను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే కోబోట్ లను తీసుకొచ్చినట్లు జనరల్ మోటార్స్ ప్రతినిధి తెలిపారు.

కంపెనీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రోబోలు తీసుకురావడం వల్ల 1000 మంది ఉద్యోగాలు కోల్పోయారని యునైటెడ్ ఆటో వర్కర్స్ లోకల్ అధ్యక్షుడు జేమ్స్ కాటన్ అన్నారు. యంత్రాలు తమ సభ్యుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఆందోళనగా ఉన్నారని చెప్పారు. భవిష్యత్ లో కూడా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏఐ రావడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో భారీగా ఉద్యోగాలు పోతున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 12 వేల నుంచి 15 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో దాదాపు రెండున్నర లక్షల మంది భారతీయులే కావడం విశేషం. ఒరాకిల్ లో కూడా భారీగా లే ఆఫ్స్ జరిగాయి. ఒకవైపు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ (AI) డేటా సెంటర్ల విస్తరణ కోసం బిలియన్ల డాలర్లు వెచ్చిస్తూ, మరోవైపు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది.అయితే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా కొన్ని మాత్రం ఏఐ ప్రభావానికి అతీతంగా ఉంటాయని రెడ్డిట్ వంటి వేదికల్లో జరుగుతున్న చర్చలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications