AI చాలా ఉద్యోగాలను నాశనం చేస్తుంది.. నిజాన్ని ఒప్పుకున్న హెచ్‌ఎస్‌బిసి సీఈఓ జార్జెస్ ఎల్హెడెరీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం ఉద్యోగులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తుండటంతో.. గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి (HSBC) సీఈఓ జార్జెస్ ఎల్హెడెరీ రంగంలోకి దిగారు. సాంకేతికతను చూసి భయపడవద్దని, మార్పును ప్రతిఘటించవద్దని ఆయన తమ బ్యాంకు సిబ్బందికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఏఐ వల్ల సిబ్బంది తమ హక్కులను కోల్పోరని, అధిక పనిభారంతో సతమతమవ్వరని ఆయన హామీ ఇచ్చారు. జనరేటివ్ ఏఐ కొన్ని సాంప్రదాయ ఉద్యోగాలను నాశనం చేస్తుందనే మాట వాస్తవమే అయినప్పటికీ, అది ఉద్యోగులను మరింత ఉత్పాదక రూపాలుగా మారుస్తుందని, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ విజ్ఞప్తుల వెనుక ఒక పెద్ద ఉద్యోగ కోతల ప్రణాళిక దాగి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

విస్తృత వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా హెచ్‌ఎస్‌బిసి మధ్యకాలికంగా దాదాపు 20 వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. బ్యాంకు కార్యకలాపాలు, సంస్థాగత నిర్మాణంలో ఏఐ ఆధారిత మార్పులు తీసుకురావడమే దీనికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా 2,11,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో, ముఖ్యంగా ఖాతాదారులతో నేరుగా సంబంధం లేని బ్యాక్ ఆఫీస్, గ్లోబల్ సేవా కేంద్రాల ఉద్యోగాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ కోతలను ఒకేసారి కాకుండా మూడు నుండి ఐదు సంవత్సరాల కాలంలో సహజంగా వైదొలగడం, వెళ్ళిపోతున్న వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం వంటి వ్యూహాల ద్వారా అమలు చేయనున్నారు.
మరోవైపు, హెచ్‌ఎస్‌బిసి పోటీదారు అయిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అధిపతి బిల్ వింటర్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. బ్యాంకులో ప్రణాళికాబద్ధమైన ఉద్యోగ కోతల గురించి మాట్లాడుతూ, ఏఐ సాంకేతికత "తక్కువ విలువ కలిగిన మానవ మూలధనాన్ని" భర్తీ చేస్తుందని ఆయన అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇలాంటి తక్కువ విలువ గల మానవ వనరుల స్థానంలో టెక్నాలజీని తీసుకురావడం ద్వారా దాదాపు 8 వేల ఉద్యోగాలను తొలగిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. మొత్తం 83 వేల మంది ఉద్యోగులు ఉన్న స్టాన్‌చార్ట్, 2030 నాటికి తన కార్పొరేట్ ఫంక్షన్ ఉద్యోగాలలో 15 శాతం కోత విధిస్తామని ప్రకటించడం ద్వారా బ్యాక్ ఆఫీస్ సిబ్బంది ఎంతటి ప్రమాదంలో ఉన్నారో తేటతెల్లం చేసింది.
ఈ రెండు బ్యాంకులు మాత్రమే కాకుండా, డిబిఎస్ గ్రూప్ (DBS), గోల్డ్‌మన్ సాక్స్, వెల్స్ ఫార్గో వంటి ఇతర ఆర్థిక దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. డిబిఎస్ గ్రూప్ మాజీ సీఈఓ పీయూష్ గుప్తా ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఆటోమేషన్ విస్తరిస్తున్నందున రాబోయే మూడేళ్లలో 4,000 కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగాలను తగ్గిస్తున్నామని, అదే సమయంలో 1,000 కొత్త ఏఐ-నిర్దిష్ట పాత్రలను సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.
తన 15 ఏళ్ల సీఈఓ కెరీర్‌లో ఉద్యోగాలను సృష్టించడానికి, ఉన్న సిబ్బందిని సరికొత్తగా పునరుపయోగించుకోవడానికి ఇబ్బంది పడటం ఇదే మొదటిసారి అని ఆయన అంగీకరించడం గమనార్హం. అలాగే, గోల్డ్‌మన్ సాక్స్ సంస్థ కూడా సిబ్బంది తగ్గింపు, నియామకాల మందగింపుపై హెచ్చరికలు జారీ చేయగా, వెల్స్ ఫార్గో మాత్రం ఏఐ వల్ల ఉద్యోగాలు తీసేయడం లేదని, కానీ తక్కువ మందితో ఎక్కువ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపింది.
మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకుల నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్, టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలలోని కంపెనీలు ఏఐ వాడకం కారణంగా గత సంవత్సరంలో ప్రతి 20 మంది సిబ్బందిలో ఒకరిని తొలగించాయి. ఈ తీవ్రమైన భారాన్ని ముఖ్యంగా యువకులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారితో పాటు భారతదేశం లేదా పోలాండ్ వంటి దేశాలలో ఐటీ సేవలు అందిస్తున్న ఆఫ్‌షోర్ కార్మికులు మోస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గి, సాంకేతికత ఆధిపత్యం పెరగనుందనే విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications
