AI Jobs: ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగాలు.. గంటకు రూ.14 వేల వరకు సంపాదన! ఎలా అప్లై చేయాలంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి టెక్కీల వరకు అందరూ భయపడుతున్నారు. కానీ, నాణేనికి మరోవైపు ఉన్నట్లుగా.. ఏఐ ద్వారానే వేల సంఖ్యలో కొత్త రకమైన జాబ్స్ (AI jobs) పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇచ్చే 'AI Trainers'కు ఇప్పుడు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ 'లింక్డ్‌ఇన్' (LinkedIn) సిద్ధమైంది.

లింక్డ్‌ఇన్ 'ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్'
లింక్డ్‌ఇన్ ప్రస్తుతం 'ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్' అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా వివిధ రంగాల నిపుణులు ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. లింక్డ్‌ఇన్ లిస్టింగ్స్ ప్రకారం, అభ్యర్థి నైపుణ్యాన్ని (Skill) బట్టి గంటకు రూ.3,700 నుండి ఏకంగా రూ.14,000 వరకు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అంటే రోజుకు కొన్ని గంటలు కేటాయించినా లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఏఐ ట్రైనర్లు ఏం చేయాలి?
ఈ ఉద్యోగాల్లో చేరే నిపుణులు ఏఐ టూల్స్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కింది పనులు చేయాల్సి ఉంటుంది..
- సామర్థ్య పరీక్ష: ఏఐ టూల్స్ ఇచ్చే సమాచారం ఎంతవరకు కచ్చితంగా ఉందో పరీక్షించడం.
- రేటింగ్ ఇవ్వడం: ఏఐ స్పందనలు (Responses) ఎంతవరకు సహజంగా ఉన్నాయి, ఎంత నాణ్యంగా ఉన్నాయనే దానికి రేటింగ్ ఇవ్వడం.
- లోపాలను గుర్తించడం: ఏఐ ఇచ్చే సమాచారంలో తప్పులను లేదా పక్షపాత ధోరణులను (Bias) గుర్తించి వాటిని సరిదిద్దడం.
- ఫీడ్‌బ్యాక్: ఏఐ మోడల్ మరింత మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన డేటాను అందించడం.
ఎవరికి ఈ అవకాశాలు?
కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే కాకుండా.. కంటెంట్ రైటర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, భాషా కోవిదులు (Linguists) , వివిధ సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్‌లకు ఈ జాబ్స్ (AI jobs) ద్వారా ఉపాధి లభిస్తుంది. ఏఐకి మానవ మేధస్సుతో తోడైతేనే అది మరింత కచ్చితమైన ఫలితాలను ఇవ్వగలదు, అందుకే కంపెనీలు ఈ తరహా ట్రైనర్ల కోసం వెతుకుతున్నాయి.
ఎలా అప్లై చేసుకోవాలి? (How to Apply)
ఈ జాబ్స్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా తమ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. మీ నైపుణ్యాల (Skills) జాబితాలో 'AI Training', 'Prompt Engineering', లేదా 'Data Validation' వంటి అంశాలను చేర్చడం ద్వారా రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించవచ్చు. అలాగే సెర్చ్ లో ఏఐ ట్రైనింగ్ అని టైప్ చేసి ఆయా జాబ్స్ కు అప్లై చేయొచ్చు.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత ఉద్యోగాలు పోయి కొత్తవి రావడం సహజం. ప్రస్తుతం జాబ్ మార్కెట్ అదే దిశలో ఉంది. ఏఐ వల్ల భయపడటం కంటే, ఆ ఏఐని మనం ఎలా నియంత్రించాలో, దానికి ఎలా శిక్షణ ఇవ్వాలో నేర్చుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. లింక్డ్‌ఇన్ తీసుకువస్తున్న ఈ కొత్త మార్కెట్ ప్లేస్ నిరుద్యోగులకు , అదనపు ఆదాయం కోరుకునే నిపుణులకు ఒక గొప్ప వరంగా మారబోతోంది.


Click it and Unblock the Notifications