15 ఏళ్ల అనుభవం AI ముందు గాలిలో కలిసిపోయింది.. రేపు మీ వంతు.. యూకేలో ఉద్యోగం పోయిన భారత టెకీ కీలక హెచ్చరిక..
AI Jobs Crisis: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ సాంకేతికతలు వేగంగా విస్తరిస్తున్న వేళ, సమాచార సాంకేతిక (IT) పరిశ్రమలో ఉద్యోగ భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎంతటి సీనియర్ ఉద్యోగులైనా, ఎంత సుదీర్ఘమైన పని అనుభవం ఉన్నప్పటికీ, మారుతున్న టెక్నాలజీ ట్రెండ్స్, కంపెనీల వ్యయ నియంత్రణ చర్యల ముందు నిలదొక్కుకోవడం కష్టమవుతోందని నిరూపించే ఒక విషాదకర సంఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది. టెక్నాలజీ రంగంలో ఏకంగా 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక భారతీయ ఐటీ నిపుణుడు, ఏఐ ఆటోమేషన్ వల్ల తీవ్రమవుతున్న ఉద్యోగుల కోతల (Layoffs) కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సోషల్ మీడియా క్రియేటర్ 'శ్రావన్' (@travelwithsravan) షేర్ చేసిన ఒక భావోద్వేగ వీడియాలో సదరు నిపుణుడు మాట్లాడుతూ.. తాను పనిచేస్తున్న సంస్థ గత మూడేళ్లుగా క్రమంగా, నెమ్మదిగా సిబ్బందిని తొలగిస్తూ వస్తోందని, చివరికి ఆ తొలగింపుల వేటు తనపై కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల నా సుదీర్ఘ ఐటీ అనుభవం ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది. మిత్రులారా.. ఏఐ ముప్పు అనేది కేవలం ప్రచారం కాదు, అది నిశ్శబ్దంగా జరుగుతున్న పక్కా నిజం. దాన ప్రభావం నాపై పడదు అని ఏ ఒక్కరూ ధీమాగా ఉండే పరిస్థితి నేడు లేదని ఆయన తోటి టెక్ నిపుణులను హెచ్చరించారు. అయితే తనను ఎందుకు తొలగించారనే దానిపై బాధపడటం కంటే.. రాబోయే రోజుల్లో ఏ మార్గంలో ముందడుగు వేయాలనే దానిపైనే తాను దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకించి ఆటోమేషన్‌కు ఎక్కువ అవకాశాలు ఉండే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, రొటీన్ కోడింగ్, సాంకేతిక మద్దతు విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు. మేధోరహితమైన లేదా పునరావృతమయ్యే పనులను ఏఐ సిస్టమ్‌లు అత్యంత వేగంగా.. చౌకగా పూర్తి చేయగలుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.
విదేశీ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో ఐటీ కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి లేఆఫ్స్ ప్రభావం భారత్‌లో కొంత తక్కువగా కనిపించవచ్చని, కానీ ఆటోమేషన్ పెరిగే కొద్దీ ఏ దేశమూ దీనికి మినహాయింపు కాబోదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం పోయిన తర్వాత ఆకస్మికంగా ఎదురయ్యే మానసిక, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి కుటుంబ సభ్యులతో ముందస్తుగా చర్చలు జరపడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అకస్మాత్తు పరిణామం సంభవించినప్పటికీ తాను ఏమాత్రం నిరాశకు గురికాకపోవడానికి తన వద్ద ఉన్న నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక (Plan-B), క్రమశిక్షణతో కూడిన ఆర్థిక పొదుపే కారణమని ఆయన స్పష్టం చేశారు. "నేను నా సంపాదనను ఇన్నేళ్లుగా వృథా చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడులు పెట్టాను. అందుకే రేపు నా పరిస్థితి ఏంటి అనే భయం లేదా ఆందోళన నాలో లేదు" అని ఆయన కొండంత ధైర్యాన్ని వ్యక్తపరిచారు.
ప్రస్తుతం ఐటీలోనే మరో ఉద్యోగం వెతుక్కోవాలా.. ఇతర సాంకేతిక విభాగానికి మారాలా లేక సొంతంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలా అనే అంశాలపై ఆలోచిస్తున్నానని చెప్పారు. తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా తీవ్ర అభద్రతాభావంలో ఉన్న ఇతర టెక్ ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన ముగించారు.


Click it and Unblock the Notifications

