Petrol Purity Test: ఎలాంటి పరికరాలు లేకుండానే ఇంట్లో పెట్రోల్ నాణ్యతను ఇలా చెక్ చేసుకోండి..
Petrol Purity Test: ఎలక్ట్రిక్ వాహనాలతో ఆటో పరిశ్రమ వేగంగా ఒకపక్క మార్పు చెందుతున్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు ఇప్పటికీ భారీగానే వినియోగంలో ఉన్నాయి. పైగా ఎక్కడ పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయాలన్నా కల్తీల భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ.. దేశంలోని రవాణాకు ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాలనే మనం వినియోగిస్తున్నాం. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మనదేశంలో శిలాజ-ఇంధన నిల్వలు పరిమితంగా ఉన్నందున, 80 శాతానికి పైగా అవసరాలు దిగుమతి చేసుకున్న చమురుతోనే గడుస్తున్నాయి. దిగుమతి సుంకం, సరుకు రవాణా ఛార్జీలు, ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్, డీలర్ మార్జిన్ కలుపుకుని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మనం పెట్రోలు లేదా డీజిల్ కొనుగోలు కోసం అధిక మొత్తం చెల్లిస్తున్నందున, ఇంధన పంపులు మనకు క్వాలిటీ ఇంధనాన్ని అందిస్తున్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. పైగా నాణ్యత లేని పెట్రోల్, డీజిల్ వినియోగం వల్ల.. వాహనాల పనితీరు, మైలేజీ తగ్గటం, స్పేర్ పార్ట్స్ పాడవటం వంటివి జరుగుతుంటాయి. అందువల్ల.. వాహన యజమానులు తమ వాహనాల కోసం కొనుగోలు చేసే ఇంధనం నాణ్యతను తనిఖీ చేయడానికి కొన్ని సులభమైన పరీక్షలను నిర్వహించాలి.

నాజిల్ క్లీన్ చేయాలి..
పెట్రోలు, డీజిల్ స్వచ్ఛత పరీక్షలను నిర్వహించడానికి కొన్ని సాధనాలు అవసరమవుతాయి. వీటిని కొనుగోలు చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కాబట్టి.. ఎలాంటి పరికరం లేకుండానే మీరు పెట్రోల్ నాణ్యతను పరీక్షించే సులభమైన పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందుకోసం వాహనదారు ముందుగా నాజిల్ ను క్లీన్ చేయాలి.

ఫిల్టర్ పేపర్ టెస్ట్..
ముందుగా.. ఫిల్టర్ పేపర్ మరక లేకుండా ఉండాలి. నాజిల్ నుంచి ఫిల్టర్ పేపర్‌కి ఒక చుక్క పెట్రోల్ వేయండి. పెట్రోలు రెండు నిమిషాల్లో ఆవిరైపోతుంది. పెట్రోలు చుక్క ఫిల్టర్ పేపర్‌ను ముదురు రంగులోకి మారితే పెట్రోల్ కల్తీ అవుతుందని అర్థం. దీంతో మీరు ఇంధనాన్ని కొనుగోలు చేసిన పెట్రోల్ పంపుపై చర్యలు తీసుకునేందుకు వినియోగదారుల రక్షణ డిపార్ట్ మెంట్ ను సంప్రదించవచ్చు. అలాంటి పెట్రోల్ బంకుల నుంచి నాణ్యత లేని పెట్రోల్ కు కొనుగోలు చేయకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. ఇకపై వినియోగదారులు కేవలం మూడు చిన్న పనులతో పెట్రోల్ నాణ్యతను ఇలా గుర్తించవచ్చు.