COVID-19 claims: కరోన్ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే..
కరోనా నేపథ్యంలో బీమా ఆర్థికంగా, మానసికంగా ధైర్యాన్ని అందించే పెట్టుబడి. కరోనాకు ముందు చాలామందికి ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయి. కానీ ఎంతోమంది దీనికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. కరోనా అనంతరం ఆరోగ్య బీమాకు ప్రాధాన్యత పెరిగింది. దీని ప్రాముఖ్యతను, అవసరాన్ని ప్రజలు గుర్తించారు. కరోనా అనంతరం ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇందులో సాధారణ ఆరోగ్య బీమాతో పాటు కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలు ఉన్నాయి.
ఈ పాలసీ తీసుకున్న వారు తమ కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకిన పరిస్థితుల్లో బీమా సంస్థను సంప్రదించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్స్ పరిష్కరించుకోవాలి. బీమా నియంత్రణ సంస్థ ఇడ్రాయ్ ప్రకారం ఇన్సురెన్స్ కంపెనీలు తక్కువకాలంలోనే పాలసీలను పరిష్కరిస్తున్నాయి.

అప్పుడే క్లెయిమ్స్ పరిష్కారం
కరోనాకు సంబంధించి ఏదైనా లక్షణాన్ని గుర్తిస్తే మొదట ప్రభుత్వ అధీకృత టెస్టింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించాలి. క్లెయిమ్స్ సెటిల్మెంట్ సమయంలో ఎదురయ్యే సమస్యల నివారణకు పాలసీ చేసిన వ్యక్తి తీసుకుంటున్న చికిత్స, హోమ్ కేర్, క్వారంటైన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే అంశానికి సంబంధించిన సమాచారాన్ని బీమా సంస్థకు వెల్లడించాలి. ఇలా చేస్తే పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం బీమా సంస్థ క్లెయిమ్స్‌ను అంచనా వేసి, దాని ప్రకారం పరిష్కరిస్తుంది.

ICMR మార్గదర్శకాలు
శ్వాసకోశ వ్యవస్థలో కరోనా ఉనికిని నిర్ధారించేందుకు ICMR ఆమోదించిన, ప్రభుత్వ ల్యాబ్స్, ప్రయివేటు ల్యాబ్స్ ఉన్నాయి. ICMR మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన డాక్టర్ సూచన మేరకు మాత్రమే ప్రయివేటు ల్యాబ్స్ పరీక్షిస్తాయి. క్లెయిమ్స్ కోసం దాఖలు చేస్తే గవర్నమెంట్ ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్ నుండి పొందిన పరీక్ష నివేదికను, దీంతో పాటు అర్హత కలిగిన డాక్టర్ పరీక్ష కోసం సిఫార్సు చేసిన ప్రిస్కిప్షన్‌ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.

ముందే పత్రాల సమర్పణ
ఆసుపత్రిలో చేరేముందు, తర్వాత అయిన ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, కరోనాకు సంబంధించిన చికిత్స ఖర్చులు పాలసీలో కవర్ అవుతాయి. కరోనా కేసుతో ఆసుపత్రిలో చేరవలసి వస్తే ముందే బీమా సంస్థకు తెలియజేసి ఆమోదం పొందడం మంచిదని సూచిస్తున్నారు. ఆసుపత్రిలో చేరడానికి ముందే అన్ని పత్రాలు సమర్పించడం మంచిది.
క్లెయిమ్స్ సెటిల్మెంట్ సమయంలో డిశ్చార్జ్ సమ్మరీ పేపర్స్ అట్టిపెట్టుకోవాలి. నెట్ వర్క్ ఆసుపత్రిలో చేరితో నగదురహితంగా క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది. నెట్ వర్క్ లేని ఆసుపత్రి అయితే రీయింబర్సుమెంట్ వస్తుంది. ఆసుపత్రిలో చేరేందుకు తమ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మెడికల్ హెల్త్ కార్డ్ వంటివి అవసరం.


Click it and Unblock the Notifications