Gratuity: ఒకే కంపెనీలో ఐదేళ్లు పని చేయకున్నా గ్రాట్యుటీ వస్తుందా.. సంచలన తీర్పు చెప్పిన కోర్టు..!
కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ఒక కంపెనీలో 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ తప్పనిసరిగా ఈపీఎఫ్ లో రిజిస్టర్ అవ్వాలి. అలాగే గ్రాట్యుటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయి. ఒక ఉద్యోగికి గ్రాట్యుటీ రావాలంటే ఒక కంపెనీలో ఐదేళ్లు పని చేసి ఉండాలి. ఒకే కంపెనీలో ఐదేళ్ల కంటే తక్కువ రోజులు పని చేస్తే గ్రాట్యుటీ రాదు. అయితే కొన్ని సందర్భాల్లో ఐదేళ్లు ఒకే కంపెనీలు పని చేయకున్నా గ్రాట్యుటీ వస్తుంది. ఇందుకు సంబంధించి కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి కాకముందే రాజీనామా చేసిన ఉద్యోగులు గ్రాట్యటీ పొందేందుకు అనర్హులని భావించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.
వాస్తవ పనిదినాలు, గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972లోని నిబంధనలను తెలుసుకోవాలని కంపెనీలను ఆదేశించింది. ఈ చట్టంలోని కొన్ని షరతులకు మీరు అర్హత సాధించినట్లయితే ఐదేళ్ల ముందే గ్రాట్యుటీ పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఐదేళ్ల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాలని హైకోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో పనిచేసే ఓ మాజీ అసిస్టెంట్ ఇంజనీర్ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల 12 రోజులు పనిచేశాడు. ఆ తర్వాత కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. అతను తనకు గ్రాట్యుటీ ఇవ్వాలని కంపెనీని కోరాడు.

కంపెనీ ఐదేళ్లు పూర్తి కాలేదని అందుకే గ్రాట్యుటీ చెల్లిండం లేదని చెప్పింది. అయితే తనకు రూ.1.75 గ్రాట్యుటీ ఇవ్వాలని అతను కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు విచారణ చేసింది. సెక్షన్ 2A ప్రకారం, ఒక ఉద్యోగి 12 నెలల కాలంలో కనీసం 240 రోజులు పనిచేస్తే.. ఒక సంవత్సరం నిరంతర సేవను పూర్తి చేసినట్లుగా పరిగణించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రూ.1.75 లక్షల గ్రాట్యుటీతో పాటు 10 శాతం వడ్డీని కూడా అతడికి చెల్లించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం గ్రాట్యుటీకి అర్హత పొందాలంటే ఉద్యోగి ఐదేళ్లు పని చేసి ఉండాలన్న నిబంధన తమకు తెలుసని పేర్కొంది.
అయితే నిరంతర సేవను నిర్ధారించడానికి షరతులను నిర్దేశించే సెక్షన్ 2A నుంచి విడిగా ఈ నిబంధనను పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి చేరిన, రాజీనామా చేసిన తేదీల మధ్య ఉన్న క్యాలెండర్ కాలాన్ని లెక్కించడం ద్వారా మాత్రమే యజమానులు గ్రాట్యుటీ అర్హతను నిర్ణయించలేరని తేల్చి చెప్పింది. ఉద్యోగులు వాస్తవంగా పనిచేసిన రోజుల సంఖ్యతో పాటు సెక్షన్ 2A కింద డీమింగ్ నిబంధన వర్తిస్తుందో లేదో కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సెక్షన్ 4(1)తో కలిపి సెక్షన్ 2A కింద పరిశీలించాలని సూచన చేసింది. ఈ వ్యక్తి జూలై 6, 2017న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరాడు. మార్చి 19, 2022న రాజీనామా చేయగా.. ఏప్రిల్ 18, 2022న సర్వీసు నుంచి రిలీవ్ అయ్యాడు. అయితే ఐదో సంవత్సరం సర్వీసులో 240 రోజులకు పైగా పనిచేసినందున తనకు గ్రాట్యుటీ చెల్లించేలా కంపెనీని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications