Aahaar: వయస్సు నిర్ధారించడానికి ఆధార్ ఒక్కటే ప్రామాణికం కాదన్న హైకోర్టు..
ఆధార్.. ఇప్పుడు దేశంలో దేనికైనా ఇది తప్పనిసరి. ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కావాలి. బ్యాంక్ అకౌంట్ తీయాలన్నా ఆధార్ కావాలి. పాన్ కార్డు తీయాలన్నా ఆధార్ కావాలి. అందుకే ఆధార్ చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఆధార్ చెల్లుబాటు గురించి ఛత్తీస్ గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాహన ప్రమాద పరిహారం నిర్ణయించే సమయంలో బాధితుడి వయసును కేవలం ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయించలేని హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం మాత్రమేనని పేర్కొంది. అది పుట్టిన తేదీకి తుది, నిర్ధారిత ఆధారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
వయస్సు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు, వైద్య పత్రాలు వంటి చట్టబద్ధమైన, విశ్వసనీయ ఆధారాలనే పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పు గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఉందని కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రంజిత్ భుంజియా అనే వ్యక్తి వయసును మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఒక్క ఆధార్ ఆధారంగా 68 ఏళ్లుగా నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ రంజిత్ భుంజియా ఛత్తీస్ ఘడ్ హైకోర్టు వెళ్లాడు.

దీనిపై జస్టిస్ సచిన్ సింగ్ రాజ్‌పుత్ విచారించారు. కేవలం ఆధార్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వయస్సు నిర్ధారించలేమని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. వైద్య రికార్డులు, వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధితుడి వయస్సు 61-65 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించింది. అంతే కాకుండా పరిహారాన్ని రూ.96,400 నుంచి రూ.3.90 లక్షలకు పెంచింది. ఇదే ప్రమాదంలో మరణించిన మరో ఇద్దరు బాధితుల కుటుంబాలకు కూడా పరిహారాన్ని పెంచుతూ తీర్పు చెప్పింది.
ఈ కేసులో బీమా కంపెనీల బాధ్యతపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రీమియం చెల్లించిన సమయం నుంచి కాకుండా, బీమా పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా ఒప్పందం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒకే మోటార్‌సైకిల్‌పై ముగ్గురు ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ, ఆ కారణం వల్లే ప్రమాదం జరిగిందని నిరూపించకపోతే దానిని సహకార నిర్లక్ష్యంగా పరిగణించి పరిహారం తగ్గించరాదని హైకోర్టు పేర్కొంది.


Click it and Unblock the Notifications