Tax exemptions: ఆర్థిక ఏడాది ప్రారంభం, ముగింపుల్లో పన్ను చెల్లింపుదారులు నుంచి ఎక్కువగా వినిపించే పేరు మినహాయంపు. వివిధ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలని తహతహలాడుతుంటారు. అయితే ఈ విధంగా పెట్టుబడి పెట్టిన మొత్తంపై కూడా పన్ను కట్టాల్సి ఉంటుందని చాలా మందికి తెలియదు.
పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్ లేదా వడ్డీల మీద కూడా ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం EEE(మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు) కేటగిరీ కిందకు వచ్చే ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేయడమే. వీటిలో పెట్టుబడి, రిటర్న్స్, మెచ్యూరిటీ మొత్తంపైనా మినహాయింపు పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టడంతో సెక్షన్ 80C కింద పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం సవరించిన వడ్డీ రేటు ఏప్రిల్-జూన్ 2024కి సంవత్సరానికి 7.1 శాతంగా ఉంది. PPF ఖాతాలకు 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. 7వ సంవత్సరం నుంచి పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఒక ఏడాదిలో కనీసం 500, గరిష్టంగా 1.5 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు.
వేతనం పొందుతున్న వ్యక్తులు పన్ను ఆదా ప్రయోజనాల కోసం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ని ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 80C కింద మినహాయింపులకు ఈ పథకంలో ఇన్వెస్టర్స్ అర్హులు. కొన్ని షరతులకు లోబడి EPF కూడా EEE బెనిఫిట్స్ అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.25 శాతం. పదవీ విరమణ వయస్సు వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. VPFకు కూడా దాదాపు ఇదే తరహా నిబంధనలు ఉంటాయి.
'బేటీ బచావో, బేటీ పఢావో'లో భాగంగా కేంద్రం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోనూ పెట్టుబడులు, వడ్డీ మరియు మెచ్యూరిటీ రాబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రతి త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది. ప్రస్తుతం సంవత్సరానికి ఆకర్షణీయమైన 8.2 శాతం ఇంటరెస్ట్ పొందవచ్చు. దీనికి 21 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి ముందుగా ఉపసంహరించుకోవచ్చు.


Click it and Unblock the Notifications