T+0 Trading: ఇక లేటు లేకుండా ట్రేడర్ల ఖాతాల్లోకి డబ్బులు.. ఎన్ఎస్ఈ పెద్ద శుభవార్త..
T+0 Settlement: భారత స్టాక్ మార్కెట్లను నియంత్రించే సంస్థ సెబీ ఇటీవల నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్న వేళ సరికొత్త విధానాలతో వేగాన్ని, సేవల్లో సమర్థతను పెంచుతూ ముందుకు సాగుతోంది.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షేర్ల కొనుగోలు, అమ్మకం విధానంలో పెద్ద మార్పును తీసుకొస్తోంది. దీని కింద ట్రేడర్లు చేసే ట్రాన్సాక్షన్లు అదే రోజున సెటిల్ చేయబడతాయని తెలుస్తోంది. ఇందుకోసం T+0 పద్ధతిలో షేర్ డీల్స్‌ను సెటిల్ చేసే విధానాన్ని సెబీ ఆమోదించింది. అంటే షేర్లు అమ్మిన రోజే ఖాతాదారుడి ఖాతాకు డబ్బులు వస్తాయి. ఈ విధానాన్ని తొలుత మార్చి 28 నుంచి ప్రారంభించనున్నారు. T+0 సెటిల్‌మెంట్ సిస్టమ్ బీటా వెర్షన్‌ను అమలు చేయడానికి SEBI ఆమోదించింది. తొలుత ఇది 25 షేర్లకు అమలు చేయబడుతుంది. అలాగే పరిమిత బ్రోకర్లు మాత్రమే దీనిని ఉపయోగించగలరని సమాచారం.

కొత్త విధానం పనితీరును రానున్న 6 నెలల పాటు సెబీ క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఈ టెస్టింగ్ పిరియడ్ తర్వాత పూర్తి స్థాయిలో విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధన వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరగడంతో పాటు రిస్క్ కూడా తగ్గుతుందని సెబీ పేర్కొంది. T+1 సెటిల్‌మెంట్ సిస్టమ్ ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ T అంటే ట్రేడింగ్ జరిగిన రోజు.
T+0 విధానంలో స్టాక్ మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగిన రోజునే షేర్ డీల్ సెటిల్ అవుతుంది. అంటే పెట్టుబడిదారుడు ఉదయం షేర్లను విక్రయిస్తే సాయంత్రానికి అతని ఖాతాలో డబ్బు మొత్తం జమ అవుతుంది. టీ+0 విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని సెబీ ప్రతిపాదించింది. ఇందులో మధ్యాహ్నం 1:30 గంటలకు డీల్ కుదిరితే సాయంత్రం 4:30 గంటలకు సెటిల్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరిగే అన్ని లావాదేవీలకు ప్రత్యామ్నాయ పరిష్కార సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నగదు, ఫ్యూచర్స్ విభాగాలలో ట్రేడింగ్ కోసం లావాదేవీల ఛార్జీలను ఒక శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇకపై వారు చౌకగా షేర్లను క్రయవిక్రయాలు చేపట్టగలరు. ఎన్ఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏడాదికి ఆదాయం దాదాపు రూ.130 కోట్ల మేర ప్రభావితం అవుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications