స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ ఝలక్: అలా జరిగితే రూ.లక్షల జరిమానా
స్టాక్ మార్కెట్ టెక్నికల్ అవాంతరాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) సీరియస్‌గా ఉంది. టెక్నికల్ అవాంతరాలు గుర్తించడం, తొలగించడం, ప్రకటించడంలో పొరపాటు జరిగితే స్టాక్ ఎక్స్చేంజీలు, ఇతర మార్కెట్ మౌలిక సంస్థలతో పాటు ఉన్నతాధికారులు భారీ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని SEBI హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు MII(మార్కెట్ మౌలిక సంస్థలు) కోసం ఒక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెక్నికల్ సమస్యలతో ఎన్ఎస్ఈలో నాలుగు గంటల పాటు ట్రేడింగ్ నిలిచింది. ఈ పరిణామం నేపథ్యంలో సెబి చర్యలు ప్రారంభించింది.

ప్రయోజనకరం..
మార్కెట్ వ్యవస్థల పనితీరు సులభంగా సాగేలా ఉండాలని, సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించేలా ఉండాలని, లేదంటే ఫైనాన్షియల్ డిసిన్సెంటివ్స్‌ను MIIలు అలాగే, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చెల్లించేలా చూడాలని సెబి సోమవారం నాటి తన సర్క్యులర్‌లో పేర్కొంది.
తమ ఈ నిర్ణయం వ్యవస్థల పనితీరును, సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు, తద్వారా అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుందని సెబి పేర్కొంది. అదే సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా చేయడంలో, ఒకవేళ సమస్య వచ్చినా కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభించేలా ప్రోత్సహిస్తుందని తెలిపింది.

ఎవరెవరికి, ఎంత జరిమానా
స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పోరేషన్, డిపాజిటరీలకు జరిమానా ఉంటుంది. రోజుకు రూ.1 లక్ష నుండి రూ.2 కోట్ల వరకు, MIIల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌లకు వార్షిక వేతనంలో 10 శాతం వరకు జరిమానా ఉండవచ్చు. సెబి నిర్దేశించే వివిధ కాలవ్యవధుల ప్రకారం మారుతాయి.

జరిమానా ఇలా..
టెక్నికల్ అవాంతరానికి గల కారణాలను వెల్లడించే కాంప్రహెన్సవ్ రూట్ వెజ్ అనాలసిస్ నివేదికను సమర్పించడంలో ఆలస్యం చేస్తే జరిమానా ఉంటుంది. దీనిని 21 రోజుల్లో ఇవ్వాలి. సంఘటన జరిగిన 24 గంటల్లో ప్రాథమిక నివేదికను ఇవ్వాలి. ఒక్కో వర్కింగ్ డే ఆలస్యానికి రూ.1 లక్ష చొప్పున ఛార్జీ ఉంటుంది.
టెక్నికల్ సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుండి రూ.25 లక్షల వరకు పెనాల్టీ. ఒకటి లేదా ఎక్కువ వ్యవస్థల్లో అవాంతరాలు తలెత్తితే డిజాస్టర్‌గా ప్రకటించాలి. ప్రకటన ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్టాండలోన్ నికర లాభంలో సగటున పది శాతం లేదా రూ.2 కోట్లలో ఎది ఎక్కువైతే ఆ ప్రాతిపదికన కట్టవలసి ఉంటుంది. ఉన్నతాధికారులు తమ వార్షిక వేతనంలో పది శాతం చెల్లించాలి. సంఘటన జరిగిన గంటంపావు నుండి మూడు గంటల్లో సాధారణ స్థితికి తీసుకు రావాలి. లేదంటే MIIలు రూ.50 లక్షలు చెల్లించాలి. మూడు గంటలు దాటితే రూ.1 కోటి కట్టాలి.


Click it and Unblock the Notifications