Saving Scheme: రోజు రూ.100 పొదుపు చేస్తే చాలు.. 5 ఏళ్లలో లక్షల రూపాయలు మీ సొంతం..!
చాలా మందికి సంపాదించడం తెలుసు కానీ.. ఎలా పొదుపు చేయాలో తెలియదు. మరికొంత మంది తమ సంపాదనే తక్కువ.. అందులో పొదుపు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అయితే రోజు రూ.500 సంపాదించే వ్యక్తి కూడా పొదుపు చేసే పథకాలు ఉన్నాయి. చిన్న మొత్తాల పొదుపు కోసం పోస్టాఫీస్ కొన్ని పథకాలను తీసుకొచ్చింది. ఇందులో ఒకటి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్(RD). ఇందులో స్వల్ప మొత్తమైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో రూ.100 కూడా పొదుపు చేయవచ్చు. మీరు ఈ పథకంలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో 6.7 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలనెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైనా పొదుపు చేయవచ్చు. పొదుపు చేసేవారు భారత పౌరుడై ఉండాలి. ఈ పథకంలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈ పథకంలో వడ్డీ ప్రతి త్రైమాసికానికి జమ చేస్తారు. ఇందులో చిరు వ్యాపారులు, చిన్న పనులు చేసుకునే వారు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో మీరు రోజు రూ.100 పొదుపు చేసినా భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు.

మీరు రోజుకు రూ.100 పొదుపు చేస్తే నెలకు రూ. 3000 చెల్లిస్తారు. సంవత్సరానికి రూ. 36,000 కడతారు. ఇలా మీరు 5 సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే మీరు రూ.180,000 కట్టినట్లు లెక్క. అప్పుడు మీకు రూ.34,097 వడ్డీతో మొత్తం రూ.2,14,097 వస్తాయి. ఈ పథకంలో ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారెంటీ మెచ్యూరిటీ ఉంటుంది. భవిష్యత్ కోసం, పిల్లల చదువు కోసం చిన్న మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఇది మంచి పథకంగా చెబుతున్నారు.
అయితే రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి, కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను కాలానుగుణంగా మార్చుతుంది. వడ్డీ రేట్ల మార్పును బట్టి మెచ్యూరిటీ మొత్తం వస్తుందని గుర్తుంచుకోవాలి. మీరు ఆలస్యంగా డబ్బులు జమ చేస్తే వడ్డీని కోల్పోయే ప్రమాదం ఉంది. పోస్టాఫీస్ లో రికరింగ్ డిపాజిట్ పథకమే కాకుండా చాల పొదుపు పథకాలు ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర (KVP), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకాలు ఉన్నాయి. ఇందులో సుకన్య సమృద్ధి యోజన ఆడ పిల్లల కోసం తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వృద్ధుల కోసం తెచ్చారు.


Click it and Unblock the Notifications