కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్‌కు మారాల్సి ఉంటుంది. ఒకవేళ పీఎన్‌జీ కనెక్షన్ తీసుకోవడానికి నిరాకరిస్తే.. సదరు గృహాలకు సరఫరా అవుతున్న ఎల్‌పీజీ (LPG) సిలిండర్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పొందాలో, అందుకు అవసరమైన పత్రాల వివరాలను ఈ కథనం వివరిస్తుంది.
ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్‌పిజి సిలిండర్ల కంటే పిఎన్‌జి కనెక్షన్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సిలిండర్ బుక్ చేయాల్సిన అవసరం లేకపోవడం, గ్యాస్ అయిపోతుందనే భయం లేకపోవడం దీని ప్రధాన ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు. పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్‌ను ఆన్‌లైన్‌లో పొందడం ఇప్పుడు చాలా సులభతరం అయింది.

గతంలో లాగా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుండే దరఖాస్తు చేసుకునే వీలుంది. ఎల్‌పిజి సిలిండర్ల కంటే పిఎన్‌జి కనెక్షన్ సురక్షితమైనది,తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియ ఎలా ఉంటుంది మరియు ఏయే పత్రాలు అవసరమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఐజిఎల్ (IGL), గెయిల్ (GAIL), లేదా అదానీ గ్యాస్ లేదా భాగ్యనగర్ గ్యాస్ వంటి సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో సాధారణంగా 'New Connection' లేదా 'Apply Online' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినప్పుడు ఒక దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, పూర్తి చిరునామా వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. మీ ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్ సౌకర్యం ఉందో లేదో తనిఖీ చేసిన తర్వాతే దరఖాస్తు ముందుకు సాగుతుంది.
అవసరమైన పత్రాలు
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా కొన్ని ముఖ్యమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది:
1. గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా పాస్‌పోర్ట్ వంటి వాటిలో ఏదైనా ఒకటి సమర్పించాలి.
2. చిరునామా ధృవీకరణ:విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్ లేదా ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు అవసరం.
3. యాజమాన్య పత్రాలు: మీరు ఉంటున్న ఇల్లు మీ సొంతం అయితే దానికి సంబంధించిన సేల్ డీడ్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ రశీదు ఇవ్వాలి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే, ఇంటి యజమాని నుండి ఎన్‌ఓసి (No Objection Certificate) తీసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు పూర్తయిన తర్వాత, మీరు రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు సంస్థను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా వసూలు చేస్తాయి. పేమెంట్ పూర్తయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ ప్రతినిధులు మీ ఇంటికి వచ్చి పైప్‌లైన్ వేయడానికి అనువైన మార్గాన్ని సర్వే చేస్తారు. సర్వే పూర్తయిన కొన్ని రోజుల్లోనే సాంకేతిక నిపుణులు వచ్చి మీ వంటగదిలో గ్యాస్ మీటర్ మరియు పైపులను అమర్చుతారు.
పిఎన్‌జి కనెక్షన్ తీసుకునే ముందు మీ ప్రస్తుత ఎల్‌పిజి గ్యాస్ స్టవ్‌ను పిఎన్‌జికి అనుగుణంగా మార్చుకోవాలి (Burner modification). దీని కోసం గ్యాస్ కంపెనీ నిపుణులే సాయం చేస్తారు. పిఎన్‌జి వాడకం వల్ల నెలవారీ బిల్లు మీరు వాడిన గ్యాస్ యూనిట్ల ఆధారంగానే వస్తుంది, ఇది సాధారణంగా సిలిండర్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. గ్యాస్ లీకేజీ వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే సంస్థ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసే సౌకర్యం కూడా ఉంటుంది.
ఈ విధానం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుండే మీరు కొత్త గ్యాస్ కనెక్షన్‌ను పొందవచ్చు. మీ ప్రాంతంలోని గ్యాస్ ప్రొవైడర్ ఎవరో తెలుసుకోవడానికి లేదా దరఖాస్తు స్థితిని తనిఖీ చేయడానికి వారి అధికారిక మొబైల్ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications