ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సబ్‌స్క్రైబర్లు తమ పీఎఫ్ నుండి ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్‌ను మెడికల్ అడ్వాన్స్ కింద ఉపసంహరించుకోవచ్చు. అయితే రూ.1 లక్ష వరకు మాత్రమే ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. హాస్పిటలైజేషన్, అత్యవసర ఇతర ఖర్చుల కోసం ఈ కార్పస్ ఫండ్ నుండి విత్-డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ నుండి నగదు ఉపసంహరణ కోసం ఉద్యోగులు హాస్పిటలైజేషన్‌కు ఇంత ఖర్చు అవుతుందని పేర్కొనవలసిన అవసరం లేదు. ఈ మేరకు పీఎఫ్ఓ సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కింద మెడికల్ అడ్వాన్స్ గ్రాంట్ చేసుకునేందుకు అనుమతిస్తూ మరోసారి ఈ సర్క్యులర్ జారీ చేసింది.

వీరికి అడ్వాన్స్
మెడికల్ అడ్వాన్స్ తీసుకోవడానికి, వైద్య చికిత్స పొందడానికి అవసరమైన నిధులును EPFO నుండి ఉపసంహరించుకోవడానికి షరతులు వర్తిస్తాయి. కరోనా అనుబంధ వైద్య చికిత్సకు ఇది వర్తిస్తుంది. సెంట్రల్ సర్వీసెస్ అటెండెంట్ (CSMA), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) కింద వైద్య సేవలు పొందేవారికి ఈ అడ్వాన్స్ లభిస్తుంది. ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం కూడా అడ్వాన్స్ తీసుకోవచ్చు.

మెడికల్ అడ్వాన్స్ ఇలా తీసుకోవచ్చు
చికిత్స అందుకునేవారు ప్రభుత్వరంగ, సీజీహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరి ఉండాలి. ప్రయివేటు ఆసుపత్రిలో చేరితే మెడికల్ అడ్వాన్స్‌కు నిబంధనలు సడలించాలని సంబంధిత అధికారికి దరఖాస్తు చేయాలి. ప్రయివేటు దవాఖానాకు చెల్లించిన వైద్య ఖర్చుల రీయింబర్సుమెంట్స్‌కు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేయాలి. ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుబ సభ్యులు రోగి తరఫున మెడికల్ అడ్వాన్స్ కోసం లేఖ సబ్‌మిట్ చేయవచ్చు. పూర్తి ఖర్చు ఎంత అన్నది పేర్కొనవలసిన అవసరం లేదు. ఆసుపత్రి, రోగి వివరాలు, ఆరోగ్య పరిస్థితి వివరాలివ్వాలి.

వీరి ఖాతాలో..
చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఖాతాలో లేదా రోగి ఖాతాలో లేదా రోగి కుటుంబ సభ్యుడి ఖాతాలో లేదా ఉద్యోగి పని చేసే సంస్థ అధికారి రూ.1 లక్ష మెడికల్ అడ్వాన్స్ డిపాజిట్ చేయవచ్చు. అదే రోజు లేదా మరుసటి రోజు అడ్వాన్స్ చెల్లించవచ్చు. ఆసుపత్రి ఖర్చు రూ.1 లక్ష దాటితే నిబంధనలకు అనుగుణంగా అదనపు అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు మంజూరు చేయవచ్చు. ఆసుపత్రి నుండి అంచనా నివేదిక అందినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేలోపు నగదు డిపాజిట్ చేయాలి.

బిల్లు ఆధారంగా..
ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే సదరు ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లో వైద్య ఖర్చుల బిల్లును ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా, ఆసుపత్రి తుది బిల్లును బట్టి మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేయవచ్చు. ఆసుపత్రి బిల్లును బట్టి మెడికల్ అడ్వాన్స్ రికవరీ లేదా రీయింబర్సుమెంట్స్ ఉంటుంది.


Click it and Unblock the Notifications