పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర ఎంతటే? కానీ 8 ఏళ్లు పడుతుందా?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని ఈ నెల 17వ తేదీన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ దాదాపు అన్ని ప్రాంతాల్లో రూ.100 దాటింది. డీజిల్ ధర సెంచరీకి చేరువలోకి వచ్చింది.
భారీగా పెరగడంతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిని జీఎస్టీ కౌన్సిల్ పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19, డీజిల్ రూ.88.62 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్కువగా కేంద్ర పన్నులు ఉన్నాయి.

పన్నులు అధికం
పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు ఉంటాయి. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.35 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి.
రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఉదాహరణకు ఓ రాష్ట్రంలో వ్యాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ (VAT) 23.07 శాతం, డీజీల్ పైన 14 శాతం ఉంది. రాష్ట్రాలకు ఈ పన్నులే కాకుండా, కేంద్రం విధించే పన్నుల్లోను వాటా వస్తుంది. కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవడంతో పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయమే అధికం.

జీఎస్టీ పరిధిలోకి వస్తే
అధికారిక డేటా ప్రకారం 2020-21 ఆర్థిక రంగంలో పెట్రోలియం రంగం ద్వారా కేంద్రానికి వచ్చిన ఎక్సైజ్ రెవెన్యూ రూ.3,71,726 కోట్లు. రాష్ట్రాలకు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్(VAT) ద్వారా వచ్చిన మొత్తం రూ.2,02,937 కోట్లు.
పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధర లీటర్ రూ.75, డీజిల్ లీటర్ రూ.68కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. అయితే గతంలోనూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ అంశం తేలలేదు.

మరో పదేళ్లు...?
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది ఈ అంశం. ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో బీజేపీ నేత, బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోడీ ప్రతిపక్షాలకు ఓ సవాల్ విసిరారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రతిపక్షాలు ఈ అంశాలు లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో లేని ఇతర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని గుర్తు చేశారు. అసలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి మరో ఎనిమిది నుండి పదేళ్లు పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు.
కేంద్రం, రాష్ట్రాలకు చెందిన డజనుకు పైగా పన్నులను విలీనం చేస్తూ 2017 జూలై 1 నుండి జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF), సహజ వాయువు, ముడి చమురును మాత్రం ఇందులో చేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకివి ప్రధాన పన్ను ఆదాయ వనరులు కావడమే ఇందుకు కారణం. జీఎస్టీ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటున్నాయి. పెట్రో ఉత్పత్తులపై మాత్రం వేరు పన్నులు ఉన్నాయి.

మరిన్ని అంశాలు
సెప్టెంబర్ 17న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కరోనా అత్యవసరాలపై పన్ను తగ్గింపు గడువును పొడిగించవచ్చునని చెబుతున్నారు. అలాగే, జీఎస్టీ విధానంలో ప్రస్తుతం ఏ ఉత్పత్తికి అయినా 28 శాతం గరిష్ఠ పన్ను రేటు ఉంది. దీని కంటే ఎక్కువ ఉండాలంటే జీఎస్టీ చట్టాన్ని సవరించాలి. వీటిపై ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రం విధిస్తున్న మొత్తం పన్నులకు సమానంగా (50 శాతం) జీఎస్టీగా వసూలు చేసే మార్గంగా 28 శాతం గరిష్ఠ రేటుతో కలిపి ఒక నిర్ణీతరేటులో సర్‌ఛార్జీని వసూలు చేసే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications