Home Loan: కరోనా తర్వాత దేశంలోని ప్రజలు సొంతింటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. దీంతో చాలా మంది అద్దెఇళ్ల నుంచి సొంత గృహాలకు మారాలని చూస్తున్నారు. దీంతో అనేక మంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి హోమ్ లోన్స్ తీసుకున్నట్లు డేటా చెబుతోంది. ప్రస్తుతం దేశంలో అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్న వేళ కొందరు సరసమైన ధర ఇచ్చే సంస్థలకు తమ రుణాన్ని బదిలీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తమ బ్యాంకుకు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. ఈ క్రమంలో హోమ్ లోన్, పర్సనల్ లోన్ విషయంలో కొన్ని రాయితీలు, షరతులతో బదిలీ చేయవచ్చు. రుణగ్రహీతలు సాధారణంగా ఇతర బ్యాంకుల నుంచి మంచి ఆఫర్‌లను పొందినప్పుడు తమ రుణాన్ని బదిలీ చేసి ప్రయోజనాలను పొందాలని చూస్తుంటారు. ఇది వారి రుణ భారాన్ని తగ్గించటంతో పాటు మెరుగైన వడ్డీ రేట్లకు రుణాన్ని పొందేందుకు దోహదపడతాయి.

రుణాన్ని ప్రస్తుతం ఉన్న బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేసినప్పుడు.. ముందుగా పాత రుణాన్ని పూర్తిగా చెల్లించాలి. ఈ క్రమంలో బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ సంస్థలు విధించే ప్రీ క్లోజర్ ఛార్జీలను సైతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త బ్యాంకుకు లోన్ బదలాయించే క్రమంలో అక్కడ సైతం లోన్ ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త రుణ రేటును పాత బ్యాంక్ అందించిన దానికంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం రుణానికి చెల్లిస్తున్న వడ్డీ రేటు కంటే తక్కువ రేటుకే మరొక బ్యాంక్ ఆఫర్ చేస్తున్నట్లు ముందుగా తెలుసుకోవాలి. మార్పు వల్ల ప్రయోజనాలను లెక్కించుకున్న తర్వాతే లోన్ బదిలీకి వెళ్లాలి.
ఇదే క్రమంలో రుణాలు తీసుకున్న తర్వాత దానిని సకాలంలో చెల్లించాలి లేకుంటే అది మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అసలు లోన్ బదిలీకి కనీసం 750 పాయింట్ల క్రెడిట్ స్కోర్ అవసరమని గుర్తుంచుకోండి. అందువల్ల సకాలంలో ఈఎంఐ చెల్లింపులను చేయండి. అలాగే కొన్ని సార్లు రుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేస్తున్నట్లు బహిర్గతం చేయని ఛార్జీలు కూడా అందులో ఉండొచ్చు కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలి. పైగా లోన్ షరతులను కూడా చూడుకోవాలి. చివరిగా రుణాన్ని బదిలీ చేయటం వల్ల వడ్డీ రేటులో 0.5 నుంచి 1 శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లయితే మీరు రుణాలను మార్చడాన్ని పరిగణించవచ్చని bankbazaar.com CEO శెట్టి సూచించారు.


Click it and Unblock the Notifications