EPFO Pension: కనీస పెన్షన్ పెంపు ఇక లేనట్లేనా.. నిరాశ మిగిల్చిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం.
పీఎఫ్ పెన్షన్ తీసుకునేవారికి మరోసారి నిరాశ మిగిలింది. కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.3000 లకు పెంచే అవకాశం వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం నాడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది ట్రస్టీస్ 240వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నా.. కనీస పెన్షన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత కొద్ది రోజులుగా ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3000 పెంచుతారని భావించారు. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా కనీస పింఛన్ రూ.1000 నుంచి రూ.7500 పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
కాగా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ వారి అసలు మూల వేతనం ఆధారంగా చందా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) చందాదారులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ అంశాలకు సంబంధించి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దరఖాస్తుదారులందరికీ అధిక EPS పెన్షన్ అందిస్తుందో లేదో కూడా వెల్లడించలేదు. ట్రస్టీస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎఫ్ డబ్బులు రిటైర్మెంట్ తర్వాత ఒక్కసారిగా కాకుండా.. నెలనెలా విడతలవారీగా పొందే సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(SWP)కి ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది.

పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఇది ఖాతాదారులకు అద్భుతమైన అవకాశామని నిపుణులు చెబుతున్నారు. తొలి దశలో 55 ఏళ్లు పైబడిన 6లక్షల 30వేల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ సదుపాయం వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. SWP ద్వారా రిటైరైన సభ్యులు తమ మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా.. క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలా తీసుకోగా మిగిలిన బ్యాలెన్స్ ఈపీఎఫ్ వ్యవస్థలోనే ఉండి.. ప్రభుత్వం అందించే వడ్డీ వస్తూనే ఉంటుందని వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సీనియర్ సిటిజన్లు ఎఫ్డీలో డిపాజిట్ చేయకుండా పీఎఫ్ లోనే డబ్బులు ఉంచుకునే అవకాశం ఉంది. ఇందులో అనేక సౌకర్యవంతమైన ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కార్పస్ నుంచి నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవడం, కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకుని మిగిలిన దానిపై వాయిదాలు పొందడం లేదా కేవలం వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే వెసులుబాటును కల్పించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా స్వచ్ఛందంగా పీఎఫ్‌లో జమ చేసే మార్గాలను ఈ ఫ్రేమ్‌వర్క్ తీసుకువచ్చే అవకాశం ఉంది. పేరోల్ ద్వారా అదనపు డబ్బు జమ, నేరుగా డిపాజిట్లు, డిజిటల్ పేమెంట్ల ద్వారా చిన్న మొత్తాల జమ వంటివి ఇందులో భాగం అయ్యే అవకాశం ఉంది. గతంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా పరిమితి 75 శాతంగా ఉండేది. ఇప్పుడు 90 శాతానికి పెంచింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో రూ.2 లక్షలు ఉన్నాయనుకుంటే.. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఉద్యోగి 90 శాతం వరకు అంటే.. రూ.1,80,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే నిరుద్యోగ ఉపసంహరణల విషయంలోనూ ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. గతంలో ఉద్యోగం పోయిన తర్వాత 12 నెలల వెయిటింగ్ పీరియెడ్ ఉండేది. ఇప్పుడు దాన్ని కేవలం 2 నెలలకు తగ్గించారు. ఉద్యోగం పోయిన రెండు నెలల తర్వాత పీఎఫ్ డబ్బులు పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications