ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు రానుంది. మార్చి 10వ తేదీ నుండి మార్చి 14వ తేదీ మధ్య ఐపీవోకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఎల్ఐసీలో వంద శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో కేవలం 5 శాతం మాత్రమే ఐపీవోకు వస్తోంది. ఈ ఐపీవోలో ఎల్ఐసీ పాలసీదారులకు పది శాతం రాయితీ ఉండనుంది. ఉద్యోగులకు కూడా ఐదు శాతం వరకు రాయితీ ఉండవచ్చు. ఐపీవో తర్వాత దేశంలోని అతిపెద్ద బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీగా ఎల్ఐసీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రిలయన్స్ మొదటి స్థానంలో ఉంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాప్‌ను దాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం....

31.6 కోట్ల షేర్లు
ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా 31.6 కోట్ల షేర్లను లేదా 5 శాతం వాటాను మాత్రమే విక్రయిస్తున్నారు. మార్చి నెలలో ఇది దలాల్ స్ట్రీట్‌లోకి అడుగు పెట్టే అవకాశముంది. పాలసీదారులు ఫ్లోర్ ధర పైన పది శాతం డిస్కౌంట్ పొందుతారు. అలాగే పాలసీదారులకు పది శాతం వరకు రిజర్వ్ ఉంటుంది. ఉద్యోగులకు 5 శాతం కోటా ఉంది.

పాలసీదారులు గుర్తుంచుకోవాలి...
ఎల్ఐసీ పాలసీదారులు షేర్లు కొనుగోలు చేయాలంటే రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి ఈ నెల 28వ తేదీ లోపు పాన్ నెంబర్‌ను పాలసీతో జత చేసుకోవాలి. ఎల్ఐసీ పోర్టల్‌లోకి వెళ్లి అప్ డేట్ చేసుకోవాలి. అలాగే, పాలసీదారుకు డీమ్యాట్ ఖాతా ఉండాలి.
Visit https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus
లోకి వెళ్లి, పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, పాన్ సమాచారం, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ పైన ప్రెస్ చేయాలి.
ఆన్‌లైన్ ద్వారా పాలసీదారు తమ పాన్ నెంబర్‌ను లింక్ చేయవచ్చు. లేదంటే ఏజెంట్ ద్వారా కూడా అప్ డేట్ చేసుకోవచ్చు.

మార్కెట్ వాటా
ఎల్ఐసీ ఐపీవో ద్వారా ద్వారా రూ.70వేల కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో ఎల్ఐసీ మార్కెట్ వాటా 65 శాతం వరకు ఉంది. FY2021-22లోని మొదటి అర్ధ సంవత్సరంలో ఎల్ఐసీ రూ.1437 కోట్ల (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) లాభాన్ని నమోదు చేసింది. కొత్త బిజినెస్ వృద్ధి 554 శాతంగా నమోదయింది. ఎల్ఐసీ ఎంబెడెడ్ వ్యాల్యూ 5.39 ట్రిలియన్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఎల్ఐసీలో 5 శాతం వాటాలు ఐపీవోకు తెస్తున్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది. అయితే ప్రభుత్వం వద్ద 95 శాతం ఉంటుంది. ఎల్ఐసీ 1956 సెప్టెంబర్ 1వ తేదీన స్థాపించబడింది. రూ.5 కోట్ల ప్రారంభ ధనంతో ప్రారంభమైంది. అప్పటి నుండి ఎన్నో ప్రయివేటు బీమా కంపెనీలు వచ్చినప్పటికీ, మార్కెట్ వాటాలో మూడింట దాదాపు రెండొంతులు ఎల్ఐసీదే.


Click it and Unblock the Notifications