Banking News: బ్యాంక్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే ఆ డబ్బులు ఎవరికెళ్తాయ్..? తెలుసుకోండి
Bank Nominee Rules: భారత బ్యాంకింగ్ వ్యవస్థ వేగవంతంగా డిజిటలీకరణ జరుగుతోంది. పాతకాలంలో మాదిరిగా అకౌంట్ల నిర్వహణకు రిజర్వు బ్యాంక్ చెల్లుచీటీ పలికింది. దీంతో ఇప్పుడు బ్యాంకులు తమ వినియోగదారులకు సంబంధించిన అన్ని విషయాలను కాలానుగుణంగా మెయిన్టెన్ చేయాల్సి వస్తోంది.
ప్రస్తుత కాలంలో ఎవరైనా వ్యక్తి కొత్తగా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకులు నామినీ వివరాలను అందించాల్సిందింగా వారికి ఒక ఫారమ్ అందిస్తాయి. అసలు ఇది నిజంగా అవసరమా.. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మనలో చాలా మందికి అనుమానాలు ఉంటుంటాయి. వాస్తవానికి నామినీ వివరాలను బ్యాంకులకు అందించటం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సదరు ఖాతాదారుడు అనుకోకుండా మరణించిన సమయంలో పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ ఖాతాను తెరిచేటప్పుడు నామినీని నామినేట్ చేయాల్సి ఉంది. అలా చేసినట్లయితే ఖాతాదారుడు మరణించిన సమయంలో సదరు వ్యక్తి చేసిన డిపాజిట్లు, పెట్టుబడులపై నామినీకి హక్కులు చట్టపరంగా ఉంటాయి.

ఒకవేళ ఖాతా యజమాని మరణించే సమయానికి నామినీ పేరు పేర్కొనకపోతే.. చట్టపరమైన వారసులు ఖాతాలోని డబ్బును లేదా యజమాని మరణించిన తర్వాత ఖాతాకు సంబంధించిన ఆస్తులను పొందడానికి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖాతాదారుడు తన కోరిక మేరకు ఒక బ్యాంక్ ఖాతాకు ఒకటి లేదా ముగ్గురు వరకు నామినీలుగా నిర్ణయించవచ్చు. దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక మార్పులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వేర్వేరు బ్యాంక్ ఖాతాలు వేర్వేరు నామినీలను కూడా ఇవ్వవచ్చు. డిపాజిట్లకు సైతం నామినీని ప్రత్యేకంగా ఇవ్వవచ్చు.
నామినీకి వర్తించే నిబంధనలను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి NRIని కూడా నామినీగా నామినేట్ చేయవచ్చు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో మాత్రమే సదరు డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. సేవింగ్స్ ఖాతాలో లేదా బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలో 10 సంవత్సరాలకు పైగా చెల్లింపులు లేకుంటే లేదా FD మెచ్యూరిటీ తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత కూడా ఖాతా నుండి మొత్తాన్ని విత్‌డ్రా చేయకపోతే, ఖాతాలోని మొత్తం ఆర్బీఐ ఆధీనంలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ కు బదిలీ చేయబడుతుంది.
ఇలా బ్యాంకుల్లో వారసుల వివరాలు లేక వాటిని ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు వేల కోట్లలో మూలుగుతోందని ఆర్బీఐ ఇప్పటికే తన గణాంకాల్లో వెల్లడించింది. ఈ డబ్బును చట్టపరమైన వారసులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ "100 రోజుల 100 చెల్లింపులు" పథకాన్ని ప్రవేశపెట్టింది. నామినీకి బ్యాంక్ ఖాతా వివరాలు లేనప్పటికీ డబ్బు అతని చట్టపరమైన వారసులకు వెళుతుంది. ఖాతాదారుని చట్టపరమైన వారసులైన జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో సహా ఎవరైనా డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. కానీ దాని కోసం మరణ ధృవీకరణ పత్రం, చట్టపరమైన వారసుడి ఫోటో, మరణించినవారి KYC వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications