Promissory Note విషయంలో ఈ రూల్స్ పాటించకపోతే మీకే నష్టం.. పైసలు పోవచ్చు జాగ్రత్త..!!
Promissory Note Rules: భారతదేశంలో అన్ ఆర్గనైజ్డ్ రంగంలో డబ్బు రుణాలను తీసుకునే వ్యక్తులు ఎక్కువ. ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల కంటే గ్రామాల్లో తెలిసిన రైతులు, వ్యాపారుల దగ్గర సహజంగా డబ్బు అప్పుగా తీసుకోవటం చూస్తుంటాం. ఊళ్లలో విరివిగా జరిపే ఈ లావాదేవీలకు ప్రజలు ప్రామిసరీ నోట్లను వినియోగిస్తుంటారు. అయితే చట్ట ప్రకారం ప్రామిసరీ నోట్లకు ఉండే పరిమితులతో పాటు పాటించాల్సిన నియమాల గురించి చాలా మందికి తెలియదు.
డబ్బు లావాదేవీకి చట్టబద్దను కలిగించటానికి ఈ ప్రామిసరీనోట్లను ప్రజలు ఉపయోగిస్తుంటారు. ఇందులో లావాదేవీలో తీసుకున్న సొమ్ము, అంగీకరించిన వడ్డీ రేటు, సాక్షి సంతకం, రుణ ఇచ్చిన తీసుకున్న వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. డబ్బులు తీసుకున్న వ్యక్తి రెవెవ్యూ స్టాంప్ అంటించిన ప్రామిసరీ నోటుపై సంతం లేదా వేలిముద్ర వేసి తాను డబ్బును పొందినట్లు ధృవీకరిస్తారు. ఇదంతా సహజంగా జరిగే విషయమే అయినప్పటికీ.. ప్రామిసరీ నోట్ల విషయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రతలకు సంబంధించిన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

చట్టపరంగా ఒక ప్రామిసరీ నోటుపై గరిష్ఠంగా రూ.కోటి వరకు మాత్రమే రుణ లావాదేవీలు నిర్వహించటానికి వెసులుబాటు ఉంటుంది. ప్రామిసరీ నోట్లపై డబ్బులు రుణంగా అందించటం అనుకోని సందర్భాల్లో సాక్ష్యంగా పనిచేస్తుంది. వీటిని కోర్టులు సైతం బలమైన సాక్ష్యాలుగా అంగీకరిస్తాయి. అనుకోని సందర్భంలో కోర్టుకు వెళ్లవలసి వస్తే మీ వద్ద ప్రామిసరీ నోటు జాగ్రత్తగా ఉండటం తప్పని సరి. ఈ ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాల పరిమితి కేవలం అందులో రాసుకున్న తేదీ నుంచి మూడు సంవత్సరాలు మాత్రమే. ఒక వేళ మూడు సంవత్సరాల కాలంలో డబ్బు చెల్లింపులు పూర్తి కాకపోతే.. గడువు ముగియక ముందుగానే తిరిగి కొత్త నోటు రాసుకోవాలి. ఈ కాలంలో వడ్డీ, అసలు చెల్లింపులకు సంబంధించిన వివరాలను నోటు వెనుక భాగంలో ఇచ్చిన ఖాళీలో నమోదు చేసుకోవచ్చు. ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే గడువు 3 ఏళ్ల లోపే చేయాల్సి ఉంటుంది లేదంటే నోటు మురిగిపోతుంది. అప్పుడు కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం ఉండదని అందరూ గుర్తుంచుకోవాలి.
నెగేషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్స్ ప్రకారం మూడేళ్ల కాలం ముగిసిన ప్రామిసరీ నోటుకు కాలదోషం పట్టి చెల్లుబాటును చట్టపరంగా కోల్పోతుంది. గడువు దగ్గరపడినప్పుడు పాత నోటు స్థానంలో మరో నోటును కొత్తగా రాసుకోవటం మంచిది. లేనిపక్షంలో గడువుకు కొన్ని నెలల ముందు లాయరును సంప్రదించి తగిన చర్యలు చేపట్టడం మంచిది. ఇలా చేయటం వల్ల పైన పేర్కొన్న కాలదోషం నుంచి లీగల్ చర్యలు కాపాడి నోటుకు కొత్త ఆయుష్యును అందిస్తాయి.
ప్రామిసరీ నోటు చట్టపరంగా ఆమోదయోగ్యతను పొందటానికి ఉండాల్సిన అంశాలివే..
1. రాతపూర్వకంగా ఉండాలి.
2. షరతులు లేకుండా ఉండాలి.
3. అప్పు తీసుకునే వారి పేరు స్పష్టంగా ఉండాలి. అంటే ప్రభుత్వ వ్యవహరాల్లో భాగంగా ఎలా ఉందో అలా ఉండేలా చూసుకోవాలి.
4. ఎవరి పేరు మీద రాయబడింది, ఎవరికి ఇవ్వాల్సింది రాయాలి.
5. ప్రామిసరీ నోటు రాసిన స్థల, తేదీలను పేర్కొనాలి.
6. అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్షరాల్లోనూ రాయాలి.
7. రెవెన్యూ స్టాంప్ అంటించి, సంతకం చేయాలి.
8. అడిగిన తక్షణం మీకు గానీ మీ అనుమతి పొందిన మరొకరికి గానీ సొమ్ము చెల్లించగల వాడను అనే భేషరతు నిర్వహణ ఉండేలా చూసుకోవాలి.
9. సాక్షుల వివరాలు ఉంటే మంచిది.
10. దీనికి అటెస్టేషన్ అవసరం లేదు.
11. నగదు ద్వారా ముట్టినదో, చెక్కుద్వారా ముట్టినదో రాయాల్సి ఉంటుంది.
12. ప్రామిసరీ నోటులో పోస్టాఫీసు జారీ చేసే రెవెన్యూ స్టాంప్‌లను అతికించాలి.


Click it and Unblock the Notifications