IRCTC News: రైలు టిక్కెట్ బుక్ అయ్యాక జర్నీ రద్దయిందా? ఇలా మీ టిక్కెట్ బదిలీ చేసేయండి!
Train Ticket Transfer: భారతదేశంలో ఇప్పటికీ సామాన్య మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు తమ ప్రయాణాల కోసం రైల్వేలను విరివిగా వినియోగిస్తూనే ఉన్నారు. ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేవారు ముందుగానే ఇందుకోసం రిజర్వేషన్లు సైతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అనుకోని కొన్ని సందర్భాల్లో ప్రయాణం రద్దు కావటం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి చక్కటి పరిష్కారం దొరికిందని చెప్పుకోవాలి. దీనిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా పూరించవచ్చు.
భారతీయ రైల్వేల ద్వారా దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది తమ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. నమ్మదగిన, అఫోర్డబుల్ రవాణా వ్యవస్థగా భారతీయులకు ఇది ప్రథమ ఎంపికగా దశాబ్ధాలుగా కొనసాగుతూనే ఉంది. విదేశాల్లో నివశిస్తున్న కొందరు సాధారణంగా స్వదేశానికి వెళ్లడానికి 2-3 నెలల ముందు టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు అనుకున్న విధంగా ప్రయాణం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో మీరు ముందుగా బుక్ చేసుకున్న మీ టిక్కెట్‌ను మరొక ప్రయాణీకుడికి బదిలీ చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న టిక్కెట్లపై ప్రయాణికుల పేరు, తేదీని మార్చుకునేందుకు భారతీయ రైల్వే సంస్థ వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.

అనుకోని పరిస్థితుల వల్ల బుక్ చేసుకున్న టిక్కెట్లకు ప్రయాణం చేయటం అసాధ్యంగా మారినప్పుడు టికెట్ రద్దుకు బదులుగా దానిని వేరొకరికి బదిలీ చేసేందుకు అవకాశం వచ్చేసింది. ఇది టిక్కెట్ క్యాన్సిలేషన్ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని నివారిస్తుంది. సదరు వ్యక్తులు తమ పేరుపై బుక్ చేసుకున్న టిక్కెట్లను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్య వంటి కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ టూరిజం, ప్రభుత్వ అధికారుల ద్వారా గ్రూప్ బుకింగ్‌ల సమయంలో టిక్కెట్‌లను గ్రూపుల మధ్య బదిలీ చేయవచ్చు. రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు టికెట్ పేరు మార్పు చేయాలి. టిక్కెట్ మార్పు కోసం అసలు ప్రయాణీకుడు, కొత్త ప్రయాణీకుడు ఇద్దరి నుంచి వ్రాతపూర్వక అభ్యర్థనతో పాటు వారి ఐడెంటిటీ అందించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్‌పై పేరు మార్చుకోవటానకి ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ కావాలి. మై బుకింగ్స్ కింద బుక్ చేసిన ఏదైనా టిక్కెట్‌పై పేరు మార్చాలనుకుంటున్నారా? అనే ఎంపికపై క్లిక్ చేయాలి. దీని తర్వాత కొత్త ప్రయాణికుడి పేరు వివరాలను పూరించి "ట్రాన్స్‌ఫర్ టికెట్"పై క్లిక్ చేయాలి. ఇందుకోసం అవసరమైన రుసుము చెల్లించి నేరుగా కొత్త ఇ-టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదే క్రమంలో అవసరమేతే బుకింగ్ తేదీని కూడా మార్చుకోవచ్చు. అయితే అది ప్రయాణానికి టిక్కెట్ల అవైలబిలిటీని బట్టి చేసుకోవచ్చు. తేదీని మార్చుకోవటానికి కూడా కొంత నిర్థేశించిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ప్రక్రియను వ్యక్తులు నేరుగా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయటానికి.. రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌కి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను నింపి సమర్పించాలి. అధికారులు మీ వివరాలను ధృవీకరించి అవసరమైన మార్పులతో కూడిన కొత్త టిక్కెట్ ప్రింట్ అందిస్తారు.


Click it and Unblock the Notifications