Budget 2026: నిర్మలమ్మ లెక్కలు అర్థం కావాలంటే.. ముందు ఈ పదాల అర్థాలు తెలుసుకోవాలి..!
ఫిబ్రవరి 1, 2026 న మన దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోంది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ ఒక ఆదివారం నాడు విడుదల కానుంది. అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్ లు, ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్ తన ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బడ్జెట్ ప్రసంగం వినేటప్పుడు కొన్ని సాంకేతిక పదాలు అర్థం కాక మనకు గందరగోళంగా అనిపించవచ్చు. అందుకే బడ్జెట్ కి సంబంధించి ప్రతి సామాన్యుడు తెలుసుకోవాల్సిన కీలక ఆర్థిక పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ 2026: ఈ కీలక పదాలు మీకు తెలుసా?
బడ్జెట్ అనేది కేవలం లెక్కల పత్రం కాదు, అది మన దేశ ఖర్చుల చిట్టా. దీనిని అర్థం చేసుకోవడానికి ఈ పరిభాష ఉపయోగపడుతుంది..
1. ద్రవ్యోల్బణం (Inflation)
సాధారణంగా వస్తువులు, సేవల ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగితే మన దగ్గర ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది (అంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది). ఉదాహరణకు నిన్న రూ.10 కి వచ్చిన వస్తువు నేడు రూ.12 అయితే, అక్కడ ద్రవ్యోల్బణం ఉన్నట్లు లెక్క.
2. ఫిస్కల్ పాలసీ (Fiscal Policy)
ప్రభుత్వం పన్నులు ఎలా వసూలు చేయాలి? ఏయే రంగాలకు ఎంత ఖర్చు చేయాలి? అని తీసుకునే నిర్ణయాలను 'రాజకోశ విధానం(ఫిస్కల్ పాలసీ)' అంటారు. ఇది బడ్జెట్ ద్వారా అమలు చేయబడుతుంది.
3. ద్రవ్య విధానం (Monetary Policy)
దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షిస్తుంది. మార్కెట్లో డబ్బు చలామణీని, వడ్డీ రేట్లను (Interest Rates) నియంత్రించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచుతారు. దీనికై తీసుకునే నిర్ణయాలు మానిటరీ పాలసీ కిందకు వస్తాయి.
4. పెట్టుబడి వ్యయం (Capital Expenditure - Capex)
ప్రభుత్వం ఆస్తులను సృష్టించడానికి చేసే ఖర్చు ఇది. అంటే రోడ్లు, రైల్వేలు, హాస్పిటళ్లు లేదా ఫ్యాక్టరీల నిర్మాణం కోసం చేసే ఖర్చు. దీనివల్ల భవిష్యత్తులో దేశానికి ఆదాయం వస్తుంది అలాగే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
5. రెవెన్యూ వ్యయం (Revenue Expenditure)
ప్రభుత్వం రోజువారీ నిర్వహణ కోసం చేసే ఖర్చు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఈ కేటగిరీలోకి వస్తాయి. దీనివల్ల కొత్తగా ఎలాంటి ఆస్తులు సృష్టించబడవు.
పన్నులు & లోటు (Deficits)
బడ్జెట్‌లో మనం ఎక్కువగా 'డైరెక్ట్ టాక్స్', 'ఫిస్కల్ డెఫిసిట్' వంటి మాటలు కూడా వింటుంటాం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
- డైరెక్ట్ టాక్స్ (Direct Tax): మనం సంపాదించే ఆదాయంపై నేరుగా ప్రభుత్వానికి కట్టే పన్నుని డైరెక్ట్ టాక్స్ అంటారు. ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax), కార్పొరేట్ ట్యాక్స్ (Corporate Tax) వంటివి.
- ఇన్ డైరెక్ట్ టాక్స్ (Indirect Tax): మనం కొనే వస్తువులు లేదా సేవలపై కట్టే పన్ను. ఉదాహరణకు జీఎస్టీ (GST), ఎక్సైజ్ డ్యూటీ వంటివి.
- ఫిస్కల్ డెఫిసిట్ (Fiscal Deficit): ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే దానిని 'ద్రవ్య లోటు' లేదా ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ప్రభుత్వం చేసే అప్పులు దీని కిందకే వస్తాయి. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ లోటును 4.4% కంటే తక్కువకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్రిప్టో& డిజిటల్ అసెట్స్ (Crypto Tax)
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై 30% పన్ను అమల్లో ఉంది. ఈసారి బడ్జెట్ లో క్రిప్టో పరిశ్రమకు సంబంధించి పన్నులను హేతుబద్ధీకరిస్తారా? లేదా? అనేది చూడాలి. ముఖ్యంగా 1% TDS విషయంలో కొంత ఉపశమనం లభిస్తుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.
మొత్తంగా బడ్జెట్ అనేది దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటిది. ముఖ్యంగా టెక్నాలజీ, వ్యవసాయం, రక్షణ రంగాలకు ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. పైన వివరించిన పదాలను గుర్తుపెట్టుకుంటే.. ఈసారి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగం మీకు చాలా తేలికగా అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications