ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మరోసారి పొడిగించింది. నిజానికి నేటితో (జూన్ 14) ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు ముగియగా, మరోసారి ఆధార్‌కార్డ్ ఉచిత అప్‌డేట్ కోసం గడువును పొడిగించింది. ఇంకా చాలా మంది ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోలేకపోవడం వల్ల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్ ఉచిత అప్డేట్కు మరో 3 నెలల వరకు గడువు పొడిగించింది. అందువల్ల యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే తమ ఆధార్ కార్డ్‌ను సెప్టెంబర్ 14 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మొదట మార్చి15 2023 వరకు ఆధార్ ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అనంతరం ఈ గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అనంతరం జూన్ 14 వరకూ అవకాశం కల్పించింది. ఇప్పడు తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగిస్తూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడం వల్లనే ఈ గడువును పొడిగించినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 14 వరకు యూఐడీఏఐ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు, అడ్రస్, ఫోటో ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఉడాయ్ అవకాశం కల్పించింది.

ఆధార్ అప్‌డేట్ చేసుకునే విధానం..
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు ముందుగా https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోర్టల్‌లో మీ ఆధార్ సంఖ్యతో లాగిన్ అవ్వాలి. అనంతరం 'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పటికే ఉన్న వివరాలు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అప్పుడు పేరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా లాంటి వాటిలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, వాటిని చేసుకోవాలి. ఒకవేళ ఏమి మార్చాల్సిన అవసరం లేకపోతే, ఉన్న వివరాలనే ఒకసారి వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి 'ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్' డాక్యుమెంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
స్కాన్డ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. చివరిగా 14 అంకెల 'అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్' వస్తుంది.దీంతో మీ ఆధార్ అప్‌డేటెడ్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో వెళ్లి చెక్ చేసుకోగలరు.


Click it and Unblock the Notifications