నేటి నుండి గోల్డ్ బాండ్స్ విక్రయం: ఇష్యూ ధర, ఆఫర్.. వివరాలు ఇవీ
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడత సావరీన్ గోల్డ్ బాండ్స్ జారీ ఈ రోజు (మే 11) నుండి ప్రారంభమవుతోంది. ఈసారి గోల్డ్ బాండ్ యూనిట్ ధరను రూ.4,590గా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. గోల్డ్ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. బాండ్స్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేపట్టే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది.

వీటి ద్వారా కొనుగోలు చేయవచ్చు
డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. బాండ్స్ కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే 5 ఏళ్ల తర్వాత పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు.

కరోనా-లాక్‌డౌన్.. ఆదరణ లభించవచ్చు
కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ బాండ్స్ జారీ చేస్తుంది. ప్రస్తుతం బంగారానికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. కరోనా కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బయట బంగారం దుకాణాలు లాక్ డౌన్ కారణంగా తెరిచిలేవు. కాబట్టి గోల్డ్ బాండ్స్‌కు మంచి ఆదరణ లభిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

2016 నుండి అది రికార్డ్ సబ్‌స్క్రిప్షన్
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2020-21 సిరీస్ 2 ఇష్యూ ధర గ్రాముకు రూ.4,590గా నిర్ణయించారు. జారీ తేదీ మే 19. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.50 తగ్గింపు లభిస్తుంది. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సిరీస్ 1లో గ్రాముకు రూ.4,639 నిర్ణయించారు. మొదటి సిరీస్‌లో రూ.822 కోట్ల విలువ కలిగిన 17.73 లక్షల యూనిట్ల కోసం సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 2016 అక్టోబర్ నుండి ఇది రికార్డ్ సబ్‌స్క్రిప్షన్.

రికార్డ్ యూనిట్లు
2015లో తొలిసారి ప్రారంభించినప్పుడు రూ.245 కోట్ల వ్యాల్యూ కలిగిన 9.14 లక్షల యూనిట్లకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 2016 అక్టోబర్‌లో రూ.1,081 కోట్ల వ్యాల్యూతో 35.98 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అప్పుడు యూనిట్ రూ.3,007గా ఉంది.


Click it and Unblock the Notifications