ప్రతి ఉద్యోగి తన జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో జమ చేస్తుంటాడు. ఈ నిధి ప్రధానంగా ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, గృహ అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువు లేదా అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా ఈ నిధిని ఉపసంహరించుకునే సదుపాయం కూడా ఉంటుంది. అందుకే, ప్రతి ఉద్యోగి తన PF ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకుంటూ ఉండటం చాలా అవసరం.
ఒకప్పుడు PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో.. చాలా ప్రక్రియలు ఆన్‌లైన్ లేదా మొబైల్ ద్వారానే పూర్తవుతున్నాయి. అయినప్పటికీ, చాలామంది ఉద్యోగులు తమ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) మర్చిపోవడం లేదా అది యాక్టివ్‌లో లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో PF బ్యాలెన్స్ చెక్ చేయలేమని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. UAN లేకుండానే PF బ్యాలెన్స్ తెలుసుకునే మార్గాలు ఉన్నాయి.

మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోవడం: మీ మొబైల్ నంబర్ మీ EPF ఖాతాకు లింక్ అయి ఉంటే, కేవలం ఒక మిస్డ్ కాల్‌తోనే మీ PF బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కొద్ది సెకన్లలోనే మీ సభ్యత్వ ID, చివరిసారిగా జమ చేసిన మొత్తానికి సంబంధించిన వివరాలు, మొత్తం PF బ్యాలెన్స్ వంటి సమాచారం SMS రూపంలో మీకు అందుతుంది. అయితే, ఈ సదుపాయం పొందాలంటే మీ UAN యాక్టివ్‌లో ఉండాలి. ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వివరాలు KYCలో అప్డేట్ అయి ఉండాలి.
SMS ద్వారా PF బ్యాలెన్స్ చెక్ చేసే విధానం: మిస్డ్ కాల్ కాకుండా, SMS ద్వారా కూడా PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 కు ఒక SMS పంపాలి.
SMS ఫార్మాట్: EPFOHO UAN ENG
ఇక్కడ ENG అంటే ఇంగ్లీష్ భాషలో సమాచారం కావాలని అర్థం. మీరు హిందీలో వివరాలు కావాలంటే ENG స్థానంలో HIN అని టైప్ చేయవచ్చు. SMS పంపిన కొద్దిసేపటికే మీ PF బ్యాలెన్స్ వివరాలు మీ ఫోన్‌కు వస్తాయి.
PF బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో PF ఖాతాలను ప్రైవేట్ ట్రస్టులు నిర్వహిస్తుంటారు. అటువంటి సందర్భాల్లో EPFO పోర్టల్‌లో బ్యాలెన్స్ కనిపించకపోవచ్చు. అప్పుడు ఉద్యోగులు తమ జీతం స్లిప్‌లు, కంపెనీ అంతర్గత పోర్టల్ లేదా HR విభాగం ద్వారా వివరాలు తెలుసుకోవాలి. అలాగే, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా EPF ఖాతాతో లింక్ అయి ఉండాలి. మీ UAN యాక్టివ్‌గా ఉండటం, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు KYCలో సరిగా అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. UAN ఇటీవల యాక్టివేట్ అయి ఉంటే, పాస్‌బుక్ అప్‌డేట్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు.
ఏదేమైనా UAN నంబర్ గుర్తు లేకపోయినా లేదా చేతిలో లేకపోయినా, మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా సులభంగా PF బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ సౌకర్యాలను ఉపయోగించి మీ భవిష్యత్ ఆర్థిక భద్రతపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండడం మంచిది.


Click it and Unblock the Notifications