ఇంట్లో రూ.1500తో వ్యాపారం స్టార్ట్ చేసి..ఇప్పుడు రూ.3 కోట్ల కంపెనీగా మార్చేసింది!
ఉద్యోగం కాకుండా సంపాదించాలని ఆలోచన ఉన్నవారు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఒకోసారి మనం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసిన వ్యాపారం ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుంది... ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సంగీతా పాండే అనే మహిళా కేవలం రూ.1500తో ప్రారంభించి నేడు రూ.3 కోట్ల వ్యాపారంగా మార్చారు. సామాన్య కుటుంబానికి చెందిన గృహిణి అయిన సంగీత నేడు ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఒక పక్క కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ మరోపక్క వ్యాపారవేత్తగా రాణిస్తూ తనలాంటి ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
సంగీతా పాండే గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక సాధారణ కుటుంబ మహిళ. ఒక సమయంలో ఆమె తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. జీవితంలోని ఎన్నో ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొన్న సంగీత పాండే గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ పూర్తి చేసింది.

సుమారు 10 ఏళ్ల క్రితం సంగీత కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో బయటికెళ్లి పని చేయాల్సి వచ్చేది. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉండడంతో వారిని చూసుకునే బాధ్యత కూడా సంగీతపైనే పడింది. దీంతో సంగీత ఇంటి నుంచే ఏదైనా వ్యాపారం చేయాలని భావించింది. అప్పుడే ఆమెకి స్వీట్ బాక్స్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం 10 ఏళ్ల క్రితం ఆమె రూ.1500 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించింది. ఇందుకు స్వీట్ బాక్సుల తయారీకి అవసరమైన వాటిని సైకిల్ పై తెచ్చుకుని వ్యాపారం ప్రారంభించింది. ఇంకా అదే సైకిల్‌పై వెళ్లి స్వీట్ బాక్సులను డెలివరీ చేసేది.
అయితే సంగీత తొలిరోజు 100 బాక్సులను తయారు చేసి విక్రయించింది. ఆ తర్వాత కస్టమర్ల నమ్మకాన్ని పొందేందుకు బాక్సుల డిజైన్, క్వాలిటీ అలాగే వారి అవసరాలకు అనుగుణంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నష్టాలు కూడా చూసింది.
చివరకు లక్నో నుంచి స్వీట్ బాక్స్ తయారీ సామాగ్రి కొనడం మొదలుపెట్టాక ఆమె తయారుచేసే స్వీట్ బాక్సుల నాణ్యత కూడా మెరుగుపడింది ఇంకా లాభాల మార్జిన్ కూడా పెరిగింది. క్రమంగా తన వ్యాపారాన్ని పెంచడం ప్రారంభించి కొంతకాలానికి రూ.35 లక్షలు అప్పు తీసుకుని ఫ్యాక్టరీని ప్రారంభించి ఉత్పత్తిని పెంచింది. నేడు స్వీట్ బాక్సుల తయారీకి లేటెస్ట్ మెషీన్స్ ఉపయోగిస్తున్నారు. ఇంకా దీపావళి సమయంలో ఆవు పేడతో ప్రత్యేకమైన ఆర్గానిక్ దీపాలను కూడా తయారు చేస్తున్నారు. 100 మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. పెళ్లై పిల్లలు పుట్టాక ఎలాంటి వ్యాపారం చేయలేమని అనుకునే మహిళలకు ఈ మహిళ చక్కటి ఉదాహరణ. మొదట్లో లాభాలు తక్కువగానే ఉన్నా.. పట్టుదలతో ఇప్పుడు రూ.3 కోట్ల కంపెనీగా చేరింది.


Click it and Unblock the Notifications