రుణం తిగిగి చెల్లించలేకపోతున్నారా? మీకూ ఈ హక్కులుంటాయ్
స్థిరాస్తి కొనేందుకు కూడబెట్టుకున్న డబ్బులతో పాటు బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్థిరాదాయం ఉన్న సందర్భంలో రుణంపై నెలవారీ వాయిదాలు చెల్లించడం పెద్ద సమస్య కాదు. కానీ ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర ఖర్చుల మూలంగా రుణాన్ని తిరిగి చెల్లించలేక పోయినా మీరు తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించి తమకు రావాల్సిన మొత్తాన్ని ఆర్ధిక సంస్థలు వసూలు చేసుకుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితే వస్తే రుణ గ్రహీతకు ఎలాంటి హక్కులు ఉంటాయో తెలుసు కోవడం మంచిది. దీనివల్ల తమకు లభించే ప్రయోజనాలను కోల్పోకుండా ఉంటారు.

పద్ధతి ప్రకారం..
రుణదాతలు తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవదానికి పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణాల విషయంలో అయితే బ్యాంకులు తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తిని తమ స్వాధీనంలోకి తీసుకుంటాయి. అయితే ఇదంతా తమ ఇష్టంవచ్చినట్టు నిర్వహించడానికి అవకాశం ఉండదు. తగిన నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రక్రియ చేపట్టాల్సిఉంటుంది.

90 రోజుల తర్వాత
90 రోజుల తర్వాత కూడా రుణ గ్రహీత బకాయిలను చెల్లించకపోయినట్టయితే ఆ ఖాతాను మొండి పద్దు (ఎన్ పీ ఏ) గా ప్రకటిస్తారు. ఇలాంటి సందర్భంలో రుణదాత 60 రోజుల నోటీసు ను రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయిన ఖాతాదారుకు జారీ చేస్తారు. ఈ నోటీసు కాలం లో కూడా చెల్లించకపోతే అప్పుడు బ్యాంకు ఆస్తిని విక్రయించే విషయంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఆస్తిని విక్రయిచే బ్యాంకు మరో 30 రోజుల కాల పరిమితితో పబ్లిక్ నోటీసు కూడా జారీ చేయాల్సి ఉంటుంది.

ఆస్తి విలువ..
ఆస్తిని వేలం వేయడానికి ముందు ఆ ఆస్తి పారదర్శక విలువను ప్రకటించాల్సి ఉంటుంది. అంతే కాకుండా దాని రిజర్వ్ ధర, తేదీ, వేలం సమయం వంటి వివరాలు కూడా నోటీసులో వెల్లడించాల్సి ఉంటుంది.

మిగులు పొందవచ్చు
స్థిరాస్తి విలువ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ ఆస్తిని విక్రయించినప్పుడు బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి మొత్తం తీసుకోగా మిగిలిన మొత్తం మీరు పొందే హక్కు రుణ గ్రహీతకు ఉంటుంది.

ప్రతిష్టకు భంగం కలగకుండా
రుణ గ్రహీతల నుంచి రుణ బకాయిలను వసూలు చేసుకోవడానికి రికవరీ ఏజెంట్లను నియమిస్తుంటారు. అయితే వీరు తమ పరిధికి లోబడి మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా ఉన్న మీరు అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఇక రికవరీ ఏజెంట్లు నిర్దేశిత కాలంలో రుణ గ్రహీతను కలవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications