తిరస్కరిస్తే... క్రెడిట్ కార్డ్ కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయవచ్చా? సులభ మార్గాలు...
మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాక... దానిని తిరస్కరిస్తే ఏం చేస్తారు? మళ్లీ మళ్లీ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం సరికాదు. సాధారణంగా ఎక్కువ వేతనం ఉన్న వారికి క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు కంపెనీలు పోటీ పడతాయి. అయితే టెక్నికల్, ఇతర సమస్యల కారణంగా తిరస్కరించబడే సందర్భాలు కూడా ఉంటాయి. దరఖాస్తు తిరస్కరణకు పలు కారణాలు ఉంటాయి.

ఎప్పుడు తిరస్కరణకు గురవుతుంది
కనీస వయస్సు లేకపోవడం, క్రెడిట్ హిస్టరీ సరిగా లేకపోవడం, తక్కువ ఆదాయం కలిగి ఉండటం, భద్రత లేని వృత్తులు, ఉద్యోగాలు చేసే వారికి క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి కనబరచవు. మీకు ఆకర్షణీయ వేతనం ఉన్నప్పటికీ సంస్థకు మంచి పేరు లేకుంటే క్రెడిట్ కార్డు జారీ తిరస్కరణకు గురి కావొచ్చు. ఓ వ్యక్తి ఉద్యోగంలో స్థిరంగా లేకుండా ఓ సంస్థ నుంచి తరుచూ మరో సంస్థకు మారినా ఇబ్బందే. క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు బ్యాంకులకు వార్షిక ఆదాయం లిమిట్ ఉంటుంది. మీరు తీసుకున్న రుణాలు సరిగ్గా చెల్లించని పక్షంలో తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. క్రెడిట్ స్కోర్ కనీసం 700గా ఉండాలి.

దరఖాస్తు తప్పిదాల వల్ల కూడా...
పైవాటితో పాటు దరఖాస్తు నింపే సమయంలో పని చేసే తప్పిదాల వల్ల కూడా క్రెడిట్ కార్డు తిరస్కరణకు గురవుతుంది. సంస్థ పేరు, అడ్రస్, ఆదాయం, ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ వంటి వాటిలో తప్పులు ఉండకూడదు. ఏ సమాచారం తప్పుగా ఇచ్చినా.. క్రెడిట్ కార్డు జారీలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే, అప్పటికే ఎక్కువ ఈఎంఐలు ఉన్నా, ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నా ఇబ్బంది. సంపాదనలో 50 శాతం వరకు గృహ నిర్వహణకు ఖర్చవుతాయని బ్యాంకులు భావిస్తాయి. మిగతా 50 శాతం సంపాదనలో.. ఈఎంఐ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటాయి. సాధారణంగా 5 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగిన వారికి మరో కార్డు జారీ చేసేందుకు బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపవు.

అలా క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు
ప్రతి క్రెడిట్ కార్డు కూడా ఆదాయాన్ని బట్టి ఇస్తారు. మనకు అర్హత లేకపోయినా ఎక్కువ వ్యాల్యూ కలిగిన క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తారు. క్రెడిట్ కార్డ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. కార్డు జారీ చేసే బ్యాంకుతో దీర్ఘకాలిక బంధం లేని వారికి ఇది మరింత ముఖ్యం. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, శాలరీ స్టేట్‌మెంట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఐటీ రిటర్న్స్ సమర్పించాలి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండే.. కొన్ని చిన్న రుణాలు తీర్చడం ద్వారా పెంచుకునే అవకాశాలు ఉంటాయి.

సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకోండి
క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో మీకు ఏది సరిపోతుందో చూసి తీసుకోవడం మంచిది. కొంతమంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారు, మరికొందరు తరుచూ ప్రయాణాలు చేస్తారు.. అలాంటి సందర్భాల్లో మీ అవసరాలు తీర్చేందుకు ఏ కార్డు సరిపోతుందో జాగ్రత్తగా చూసుకోవాలి. క్రెడిట్ కార్డు కోసం లెక్కకు మించి దరఖాస్తు చేయవద్దు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండి, ఇతర బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ పెరిగే వరకు వేచి చూడాలి. యాడ్ ఆన్ కార్డు దరఖాస్తు చేసుకుంటే మంచిదే.

ఎంత లాభమో.. అంత నష్టం
క్రెడిట్ కార్డును క్రమశిక్షణతో ఉపయోగిస్తే ఎంత లాభమో.. క్రమశిక్షణ లేకుండా ఉపయోగిస్తే అంతకంటే ఎక్కువ నష్టం. కాబట్టి క్రెడిట్ కార్డు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఖర్చులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోండి. క్రెడిట్ కార్డు బిల్ టైమ్ లోపు చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్ పెంచాలి. అవసరమైతే తప్ప క్రెడిట్ ఎండ్ వరకు ఖర్చు చేయకండి. అవసరమైన క్రెడిట్ కార్డును ఎంచుకోండి.


Click it and Unblock the Notifications