రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. ఈ కేలండర్ ఇయర్‌లో ఫిబ్రవరి, ఏప్రిల్ తర్వాత.. జూన్ 6న రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడు 5.75గా ఉంది. గత నాలుగైదు నెలల్లో 6.5 నుంచి 5.75 శాతానికి తగ్గింది. ఈ రెపో రేటు ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్ణయించింది.

రెపో రేటుకు హోమ్ లోన్స్ అనుసంధానం
హోమ్ లోన్స్ పైన జూలై 1వ తేదీ నుంచి రెపో రేటును అనుసంధానం చేయనున్నట్లు ఎస్బీఐ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ బ్యాంకు తమ స్వల్పకాల రుణాలు, భారీ సేవింగ్స్ డిపాజిట్ల పైన రెపో రేటుతో అనుసంధానం చేసింది. అదే సమయంలో రూ.లక్షకు పైబడి పరిమితి ఉన్న క్యాష్ క్రెడిట్ అకౌంట్ (సీసీ), ఓవర్ డ్రాఫ్టు వినియోగదార్లకు వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రయోజనాలు కూడా జూలై 1 నంచి అమల్లోకి వస్తాయి. క్రెడిట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్టు కస్టమర్లకు రెపో రేటు 8 శాతంగా మారనుంది. ఇక రూ.1 లక్షకు పైబడిన సేవింగ్స్ డిపాజిట్లకు 3 శాతంగా ఉంటుంది. రూ.1 లక్షకు పైబడిన సీసీ ఖాతాలు, ఓవర్ డ్రాఫ్టులను రెపో రేటుతో 2.25 శాతం కలిపితే ఎంత వస్తే అంత (రెపో రేటు ప్లస్ 2.25 శాతం) మార్చిలో ఎస్బీఐ అనుసంధానం చేసింది. రూ.1 లక్షకు పైబడిన సేవింగ్స్ డిపాజిట్ రేట్లను రెపో రేటు నుంచి 2.75శాతం తీసివేస్తే ఎంత వస్తే అంత (రెపో రేటు మైనస్ 2.75 శాతం)గా నిర్ణయించింది. ఆర్బీఐ గురువారం రెపో రేటు తగ్గించడంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

హోమ్ లోన్ ఇలా...
ఎస్బీఐ రూ.75 లక్షల వరకు హోమ్ లోన్స్ రెపో రేటుపై 2.65 శాతం ఎక్కువ వడ్డీకి లభించనున్నాయి. రెపో రేటు 5.75 శాతానికి 2.65 శాతం కలుపుకుంటే లోన్ 8.40 శాతానికి చేరుకుంటుంది. అలాగే, బ్యాంకు ఎంసీఎల్ఆర్ ఆధారిత హోమ్ లోన్స్ కూడా ఆఫర్ చేస్తుంది. కస్టమర్లు వారి లోన్స్‌కు రెపో రేటు ఆధారిత వడ్డీ రేటుకు మార్చుకోవచ్చు. ఇందుకు కొంత ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం ఎస్బీఐ హోమ్ లోన్స్ 8.55 శాతం నుంచి 9.15 శాతం వరకు వడ్డీ ఉంది.

0.05 నుంచి 0.10 శాతం వరకు తగ్గించిన ఓబీసీ
ఇదిలా ఉండగా, రుణాలపై అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా నిర్ణయించే వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) తగ్గించింది. ఆయా రుణాల కాల పరిమితిని బట్టి ఈ తగ్గింపు 0.05 శాతం నుంచి 0.10 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ఈ తగ్గిమపు మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే రేటును ఆర్బీఐ ఇటీవల పావు శాతం తగ్గించిన నేపథ్యంలో ఓబీసీ ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications