తాగి నడిపినా, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయినా రూ.10వేలు, వారికి రూ.1 లక్ష వరకు ఫైన్
ఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించే ప్రతిపాదనల మోటారు వాహనాల చట్టం బిల్లుకు మోడీ కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. మోటార్ వెహికిల్స్ బిల్లు (సవరణ) 2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు 2019కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే, మైనర్ల చేతికి వెహికిల్ ఇస్తే భారీ పెనాల్టీ విధించనున్నారు.

దారి ఇవ్వకుంటే రూ.10,000 ఫైన్
ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు. అనర్హత ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేస్తే రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లకు తాళాలు ఇచ్చి వారు నడిపినట్లు తేలితో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు రూ.25వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. మోటార్ వెహికిల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

స్పీడ్ డ్రైవింగ్‌కు రూ.2,000
స్పీడ్ డ్రైవింగ్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధిస్తారు. ఇన్సురెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2,000 వరకు ఫైన్ విధిస్తారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే రూ.1,000 జరిమానా, లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. సీటు బెల్టు, హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌కు రూ.5వేలు వసూలు చేయనున్న ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ10,000 జరిమానా కట్టేలా నిబంధనలు కఠినతరం చేశారు.

అనర్హులు వాహనం నడిపితే రూ.10,000
ప్రమాదకర డ్రైవింగ్‌కు గతంలో రూ.1,000 జరిమానా ఉండగా, ఇప్పుడు దానిని రూ.5,000కు పెంచుతున్నారు. అధికారుల ఆదేశాల ఉల్లంఘనకు అంతకుముందు రూ.500 ఉండగా, ఇప్పుడు రూ.2,000 జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5,000 జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

వారికి రూ.1 లక్ష వరకు ఫైన్
అగ్రిగేటర్స్ లైసెన్స్ ఉల్లంఘనకు పాల్పడితే రూ.1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు మినహాయింపు ఉండగా, దానిని ఇప్పుడు ఎత్తివేస్తున్నారు. ఓవర్ లోడ్ వెహికిల్స్‌కు రూ.20,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ అమలు చేయాల్సిన అధికారులు ఉల్లంఘనకు పాల్పడితే రెండింతలు జరిమానా విధిస్తారు. కాగా, 18 రాష్ట్రాలకు చెందిన రవాణా శాఖ మంత్రుల ప్రతిపాదనలు, సూచనలను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలించి, తుది ప్రతిపాదనలు సిద్ధం చేసింది.


Click it and Unblock the Notifications