పెళ్లిళ్లు, శుభకార్యాల సందర్బంగా కట్నకానుకలు ఇవ్వడం మన సంప్రదాయం. కొంత మంది బహుమతుల రూపంలో, మరికొంత మంది నగదు రూపంలో కానుకలు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. చాలా మంది కార్డుల రూపంలో బహుమతులు ఇస్తున్నారు. నగదు తీసుకోవడానికి ఎక్కువ మంది మొహమాట పడుతుంటారు. కార్డు రూపంలో అయితే పెద్దగా ఆలోచించరు. అందుకే చాలా మంది వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చాలా మంది తమ రోజువారీ ఆర్ధిక లావాదేవీల కోసం కూడా ఈ ప్రీపెయిడ్ కార్డులను వినియోగిస్తున్నారు.
ప్రయోజనాలు
ప్రీపెయిడ్ కార్డుల వినియోగం పెరిగి పోవడానికి వాటి వినియోగంలో ఉన్న సౌలభ్యాలే కారణంగా చెప్పవచ్చు. ఈ కార్డులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కే పరిస్థితి ఉండదు. మనకు ఇష్టం వచ్చినంత సొమ్మును ఇందులో లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వవచ్చు. వివిధ రకాల బిల్లుల చెల్లింపుల కోసం, నగదును ఏటీఎం నుంచి తీసుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఈ కార్డులో మనకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే నగదును లోడ్ చేసుకుంటాము కాబట్టి అంత మేరకు మాత్రమే వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ కార్డు పోయినా ఆ మేరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ఈ కార్డుల వల్ల నగదు వెంట తీసుకువెళ్లే అవసరం ఉండదు. నగదు రహిత లావాదేవీలు పెరిగిపోవడానికి ఈ కార్డులు ఎక్కువగా ఉపయోగ పడుతున్నాయి. ప్రీపెయిడ్ కార్డుల వినియోగంలో ప్రపంచంలోని దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

పెరుగుతున్న పాపులారిటీ
ప్రీపెయిడ్ కార్డుల్లో గిఫ్ట్ కార్డులు, ట్రావెల్ కార్డులు ఉంటాయి. ఈ కార్డులను బ్యాంకులతో పాటు అనేక సంస్థలు, షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్లు అందిస్తున్నాయి. ఫ్యాషన్, డిపార్ట్ మెంట్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్,ఎంటర్టైన్మెంట్, రిటైల్, ఆతిథ్య రంగాల్లోని సంస్థలు ఇస్తున్నప్రీపెయిడ్ కార్డులకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ కార్డుల వినియోగం వల్ల డిస్కౌంట్లు కూడా లభిస్తుండటంతో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. నగదుకు బదులుగా ఈ ప్రీపెయిడ్ కార్డులను బహుమతిగా ఇవ్వడం వల్ల తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా బహుమతులు ఇచ్చే సమయాల్లో ఎక్కువ మంది ఒకే రకమైన వాటిని ఎంచుకుంటూ ఉంటారు. దీని వల్ల ఆ బహుమతులు అందుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వారికి అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రీపెయిడ్ కార్డులు దోహదపడతాయి.
* ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులకు బ్యాంకు ఖాతాకు ఎలాంటి అనుబంధం ఉండదు. కాబట్టి కార్డు పోగొట్టుకున్నప్పటికీ ఖాతాలోని సొమ్ము పోతుందన్న భయం అవసరం లేదు.
* కొన్ని రకాల ప్రీపెయిడ్ కార్డులపై కొన్ని చార్జీలు ఉంటాయి. మరికొన్ని కార్డులపై ఆఫర్లు ఉంటాయి.
* ఈ కార్డులు సౌకర్యవంతగా ఉండటమే కాకుండా పొదుపునకు, వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి.
* ఈ కార్డుల వల్ల ఖర్చులు కూడా అదుపులోనే ఉంటాయి.
* ఈ కార్డుల్లో సొమ్మును ఆ కార్డులకు సంభందించిన స్టోర్లలో క్రెడిట్/డెబిట్/నగదు వినియోగించి లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications