క్రెడిట్ కార్డ్‌ను ఇలా వాడితేనే ఉపయోగం: బేసిక్స్ తెలుసుకోండి
సాధారణంగా చాలా మంది క్రెడిట్ కార్డ్ అంటే భయపడ్తారు. అది క్రెడిట్ కార్డ్ కాదు.. క్రెడిట్ కాటు అంటూ ఆమడదూరం పరిగెడతారు. ఎందుకంటే దాని స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం ఇలాంటి అనవసర ఆందోళన పడ్తారు. ఓవర్ స్పెండింగ్.. అనేది ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే.. అనవసరంగా మనకు తెలియకుండా ఎక్కువ ఖర్చుపెడ్తామేమో అనే భయమే ఇందుకు కారణం. సాధారణంగా క్రెడిట్ కార్డ్ ఓ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. దీనిపై సదరు సంస్థలు విధించే వడ్డీ 24-48 శాతం వరకూ ఉంటుంది. అంటే నెలకు వందపై రూ.2 నుంచి 4 రూపాయల వడ్డీ. ఈ స్థాయిలో వడ్డీ కడితే.. ఏడాదిన్నర రెండేళ్లకే మీరు తీసుకున్న అప్పుకు రెట్టింపు కట్టాలి. వాస్తవానికి ఇది అత్యంత ఈజీగా దొరికే అప్పు. దీన్ని సక్రమంగా వినియోగిస్తే.. బెస్ట్ టూల్ అవుతుంది. భయపడి దీని జోలికే వెళ్లకపోవడం కంటే పూర్తిగా అవగాహన తెచ్చుకుని వినియోగిస్తే ఎన్నో ఉపయోగాలుంటాయి.
ఖర్చులను రాసుకోండి
చాలామంది చేసే పొరపాటు ఏంటంటే... ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చు చేసేయడం. నెల తిరిగే సరికి ఇంత ఖర్చు పెట్టామా అని ఆందోళనపడ్తారు. చేతిలో డబ్బులిస్తే ఉండే గుర్తూ, ఆ బాధ క్రెడిట్ కార్డ్ గీకడంలో ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు మనం ఈ నెలలో ఎంత ఖర్చు చేశాం క్రెడిట్ కార్డ్ ద్వారా అనే సమాచారాన్ని చూసుకంటూ ఉండాలి. ఈ మధ్య యాప్స్ వచ్చాయి కాబట్టి వాటిని ట్రాక్ చేసుకోవాలి. షాపింగ్, రెస్టారెంట్స్ సమయంలో ఎడాపేడా డెబిట్ ఉన్నా సరే క్రెడిట్ కార్డునే స్వైప్ చేస్తాం. అందుకే బిల్ జనరేటింగ్ డేట్, పేమెంట్ డ్యూ డేట్‌ను పక్కాగా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంతేకాదు సాధ్యమైనంత వరకూ మినిమం అమౌంట్ డ్యూను మాత్రమే కట్టి ప్రిన్సిపుల్‌ను లేట్‌గా కట్టడం మాత్రం చాలా పెద్ద పొరపాటు.

బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది
మనకు నెలనెలా రూ.20 వేలు ఖర్చవుతుంది అనుకుందాం. గ్రాసరీ బిల్స్, పెట్రోల్, రెస్టారెంట్స్, షాపింగ్ వంటివన్నీ ఇందులో వస్తాయని అనుకుందాం. ఇప్పుడు మీ ఖర్చంతా పూర్తిగా క్రెడిట్ కార్డ్‌తోనే స్వైప్ చేస్తే.. ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా నలభై నుంచి యాభై రోజుల ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ దొరుకుతుంది. ఈ లోపు మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు ఎంతో కొంత వడ్డీని తెచ్చిపెడ్తుంది. అయితే పక్కాగా క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ లోపు ఆ అప్పు తీర్చేస్తేనే ఈ రూల్ వర్కవుట్ అవుతుంది. లేకపోతే ఈ ప్లాన్ పనికిరాదు. ఇలా మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ, డ్యూడేట్‌లోగా పక్కాగా కట్టేస్తూ ఉంటే క్రెడిట్ కార్డ్ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పైన చెప్పినట్టు మీకు చేతగాకపోతే దాన్ని వాడకపోతేనే బెటర్.


Click it and Unblock the Notifications