డిజిట‌ల్ చెల్లింపుల‌కు బ‌డ్జెట్ ఊతమిచ్చేనా?

రైల్వే బడ్జెట్‌ విలీనం... బడ్జెట్‌ తేదీని నెల రోజుల ముందుకు జరపడమే కాదు.. ఈ సారి బడ్జెట్‌కు మరో ప్రత్యేకతను సైతం సంత‌రించుకుంది. అదే కాగిత ర‌హిత‌ బడ్జెట్‌. ‘‘గో గ్రీన్‌'' కార్యక్రమంలో భాగంగా ఎక్కువ‌గా

రైల్వే బడ్జెట్‌ విలీనం... బడ్జెట్‌ తేదీని నెల రోజుల ముందుకు జరపడమే కాదు.. ఈ సారి బడ్జెట్‌కు మరో ప్రత్యేకతను సైతం సంత‌రించుకుంది. అదే కాగిత ర‌హిత‌ బడ్జెట్‌. ''గో గ్రీన్‌'' కార్యక్రమంలో భాగంగా ఎక్కువ‌గా బడ్జెట్‌ పత్రాలను ముద్రించ‌కూడ‌ద‌ని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతేడాది ''గో గ్రీన్‌'' బోర్డు చూసి జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కో మీడియా సంస్థకు మూడు కాపీలు ఇచ్చారు. ఈ సారి ఇవ్వబోమని ప్రభుత్వం ముందే ప్రకటించింది. మామూలుగా ఒక్కో బ‌డ్జెట్ కాపీని ముద్రించడానికి రూ. 3450 ఖర్చవుతుంది. ప్రస్తుతం కాగిత ర‌హితం చేయ‌డంతో ప్రభుత్వ ఖజానాకు రూ. కోటి ఆదా అవుతుందని అంచనా. గతేడాది ముద్రణలో కోత విధించడంతో రూ.30 లక్షలు ఆదా అయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ సారి కేవలం రూ. 10 లక్షల వరకు మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉంది. ఒక ప‌క్క కాగిత ర‌హిత బ‌డ్జెట్ మ‌రో వైపు న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెంచేందుకు కేంద్రం ఇతోధికంగా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ బ‌డ్జెట్ గురించి మ‌రిన్ని అంశాల‌ను తెలుసుకుందాం.

ప్ర‌భుత్వ యాప్‌ ‘భీమ్‌' పుంజుకునేలా

ప్ర‌భుత్వ యాప్‌ ‘భీమ్‌' పుంజుకునేలా

డిజిటల్‌ చెల్లింపుల్ని సులువుగా జరిపేలా ప్రభుతం ‘భీమ్‌' యాప్‌ను తీసుకొచ్చింది. అతి త‌క్కువ కాలంలోనే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పెద్ద సంఖ్యలో (కోటి మందికి పైగా) డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో బ్యాంక్‌ ఖాతా నుంచి నేరుగా డబ్బు చెల్లించుకోవచ్చు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంది. వివిధ వర్గాల ప్రజలు దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఈ యాప్‌కు భద్రతా ప్రమాణాలను ప‌టిష్టంగా నిర్వ‌హించాల్సి ఉంది. సైబ‌ర్ భ‌ద్ర‌తా ప్రమాణాల‌ను క‌ట్టుదిట్టం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో వీటిపై న‌మ్మ‌కం పెంచాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది.

బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా చెల్లింపుల ప్రోత్సాహానికి

బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా చెల్లింపుల ప్రోత్సాహానికి

పెద్ద నోట్ల మార్పిడి త‌ర్వాత బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి చాలా న‌గ‌దు వ‌చ్చి చేరింది. దాని ప్ర‌భావంతో వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డం సైతం చూశాం. ప్రస్తుతం ఆసియా వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన వూపందుకోవడంతో 2019 నాటికి ఆసియాలో ఏటా దాదాపు 19 ట్రిలియన్‌ డాలర్ల మేరకు ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుగుతాయని అంచనా.వోడాఫోన్ ఎంపెసాతో కెన్యా దేశంలో సింహ భాగం లావాదేవీలు ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్నాయి. బ్రెజిల్‌ వంటి దేశాల్లో నగదు డిపాజిట్లు, చెల్లింపులు చిల్లర దుకాణాల్లో కూడా జరుగుతాయి. అక్కడ ప్రభుత్వం అటువంటి పటిష్ఠమైన బ్యాంకింగ్‌ వ్యవస్థను రూపొందించింది. అమెరికా ఒక ప్ర‌ణాళిక‌తో ఐదారేళ్ల కాల‌వ్య‌వ‌ధిలోనే ప్ర‌జ‌ల‌ను డిజిట‌ల్ లావాదేవీల దిశ‌గా ఆక‌ర్షించ‌గ‌లిగింది. ఇంట‌ర్నెట్ వినియోగం త‌క్కువ‌గా ఉండి, సాంకేతిక నిర‌క్ష‌రాస్య‌త అంత‌గా లేని మ‌న‌లాంటి వ‌ర్థ‌మాన దేశాల్లో స్వ‌చ్చంద సంస్థ‌లు, బ్యాంకులు పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పిస్తే గానీ ఇవ‌న్నీ సాకారం కావు. ఆ దిశగా ఈ బడ్జెట్‌ నుంచి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకుల‌కు దీనికి సంబంధించి కేంద్రం స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవ్వాల్సి ఉంది.

‘డిజిటల్‌'చెల్లింపుల‌కు ప్రోత్సాహ‌కాలు:

‘డిజిటల్‌'చెల్లింపుల‌కు ప్రోత్సాహ‌కాలు:

డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ‘నీతి ఆయోగ్‌' ద్వారా రూపే, యూఎస్‌ఎస్‌డీ(*99#), యూపీఐ కార్డుల వాడకాన్ని ప్రోత్సహించేలా బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాటి పేర్లు డిజి ధ‌న్‌, ల‌క్కీ గ్రాహ‌క్ వ్యాపార్ యోజ‌న‌. గ‌తేడాది డిసెంబరు 25 నుంచి ఏప్రిల్‌ 14 వరకు జరిపిన లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని బ‌హుమ‌తులు అంద‌జేస్తారు. ఇందుకోసం రూ. 50 నుంచి రూ. 3000 లోపు లావాదేవీల‌ను లెక్క‌లోకి తీసుకుంటారు. వీటికోసం రోజువారీ, వారాంతం లాట‌రీలు తీస్తారు. ఏప్రిల్‌ 14న మెగా డ్రా ఉంటుంది. తొలి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ. 50 లక్షలు, మూడో విజేతకు రూ. 25 లక్షలు చెల్లిస్తారు.

 రాష్ట్రం, కేంద్రం చెట్టాప‌ట్టాల్‌:

రాష్ట్రం, కేంద్రం చెట్టాప‌ట్టాల్‌:

డిజిటల్‌ చెల్లింపుల దిశగా రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించే దిశలోనూ కేంద్రం వేగంగా క‌దులుతోంది. డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించి, వాటి తగ్గ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇప్పటికే కేంద్రం వెల్ల‌డించింది. బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రుల క‌మిటీ ఒక స్థాయి దాటి జ‌రిపే న‌గ‌దు లావాదేవీల‌పైన ప‌న్ను విధించాల‌ని కేంద్రానికి సూచించింది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్టే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను సైతం న‌గ‌దు ర‌హితంగా చేస్తేనే ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ లావాదేవీల‌పై ఆస‌క్తి పెరుగుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ దుకాణాల్లో వ‌స్తువుల పంపిణీని న‌గ‌దు ర‌హితం చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

ఎండీఆర్‌ ఛార్జీల మాటేమిటి?

ఎండీఆర్‌ ఛార్జీల మాటేమిటి?

పాల దుకాణాలు, పాన్ షాపు, కిరాణా కొట్టు, హెయిర్ సెలూన్స్‌, హోట‌ళ్లు వంటి వాటిల్లో కూడా పీవోఎస్‌ మెషీన్‌ ఉంటే ఎంత బాగుంటుంది? హాయిగా చిల్ల‌ర స‌మ‌స్య లేకుండా కార్డుతో డబ్బులు చెల్లించవ‌చ్చు. మ‌న వైపు నుంచి ఆలోచిస్తే కొనుగోలుదారుగా బాగానే ఉంటుంది. కానీ మనం కొనుగోలు చేసిన ప్రతిసారీ... ఆ వ్యాపారి ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌) రూపంలో కొంత రుసుము బ్యాంకుల‌కు చెల్లించాలి. ఇది వాళ్లకు భారమే. ఈ ఎండీఆర్‌ ఛార్జీ మూలంగానే గతంలో చాలా షాపుల వాళ్లు పీఓఎస్‌ మెషీన్లు పెట్టుకోవడానికి ముందుకొచ్చే వారు కాదు. బ్యాంకులు వ్యాపారుల నుంచి వసూలు చేసే ఈ ఛార్జీని తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయడం మంచిదని ఆర్థిక నిపుణులు ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్‌లో ఈ దిశ‌గా ఎటువంటి నిర్ణ‌యాల‌ను వెలువ‌రిస్తారో చూడాలి.

 6. ల‌క్ష గ్రామాల్లో పీవోఎస్‌ల పంపిణీకి య‌త్నాలు:

6. ల‌క్ష గ్రామాల్లో పీవోఎస్‌ల పంపిణీకి య‌త్నాలు:

ల‌క్ష గ్రామాల్లో పీవోఎస్ యంత్రాల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల అభివృద్ధి విస్తరించుటకు, నాబార్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న బ్యాంకులకు నాబార్డ్ చేయూతనందిస్తుంది. 10,000 కంటే తక్కువ జనాభా ఉన్న లక్ష గ్రామాలలో ప్రతి గ్రామానికి 2 పీవోఎస్‌ పరికరాలు అందిస్తుంది . ఈ పీవోఎస్ యంత్రాలు ప్రాధమిక సహకార సంఘాలు/పాల సంఘాలు/వ్యవసాయ ఇన్పుట్ డీలర్స్ ద్వారా అగ్రి సంబంధించిన లావాదేవీలు చేస్కుండై సదుపాయం కల్గిస్తాయి . దీనివల్ల దాదాపు లక్ష గ్రామాల్లో ఉన్న 75 కోట్ల జనాభా నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు. పీవోఎస్ యంత్రాలు వాడేలా వ్యాపారుల‌ను ప్రోత్స‌హించేందుకు గాను చైనా నుంచి దిగుమతి చేసుకునే వీటిపై ఇప్పటికే ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఎత్తి వేసింది. దేశీయంగా పీవోఎస్ యంత్రాల త‌యారీకి సైతం ప‌న్ను రాయితీల‌ను ప్ర‌టించారు. దీనికి సంబంధించిబ‌డ్జెట్‌ స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు.

ఆధార్ కార్డే చెల్లింపుల‌కు ఆధారంగా:

ఆధార్ కార్డే చెల్లింపుల‌కు ఆధారంగా:

ఆధార్ అనుసంధానించి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వ్య‌వ‌స్థీకృతం చేయ‌డం మూలంగా గ‌త రెండేళ్ల‌లో కేంద్రానికి రూ. 36,144 కోట్లు ఆదా అయింద‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్ తెలిపారు. ఆధార్‌ కార్డు సాయంతో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని కేంద్రం కృత‌నిశ్చ‌యంతో ఉంది. దీనిలో భాగంగా బ్యాంకు ఖాతాలను ఆధార్‌కు అనుసంధానించే ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 49 కోట్ల ఖాతాల విష‌యంలో ఈ ప్ర‌క్రియ పూర్తికాగా ఇక‌పై నెల‌కు 2 కోట్ల ఖాతాల‌ను అనుసంధానించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ ద్వారా ఆధార్‌ సంఖ్య, వేలిముద్రల ద్వారా సొమ్ము తీసుకోవడం, ఇవ్వడం వంటి పద్ధతులను ప్రవేశపెట్టే అవ‌కాశం ఉంది. ఇటువంటి చెల్లింపులకు 14 బ్యాంకులు సుముఖత వ్యక్తం చేశాయి. ఏపీలో కొన్ని బ్యాంకులు ఈ తరహా సేవలను ఇప్పటికే అమలు చేస్తున్నాయి.

8. పన్ను మినహాయింపులు:

8. పన్ను మినహాయింపులు:

స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా సాధారణ మొబైళ్లలో కూడా న‌గ‌దు ర‌హిత లావాదేవీలు ఎక్కువ‌గా జ‌రిగేందుకు అవ‌గాహ‌న‌ను పెంచాలి. నిర‌క్ష‌రాస్యులు సైతం మొబైల్ ద్వారా క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్స్ జరిపేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. అప్పుడే నెట్‌ లేకుండా, ఖర్చు లేకుండా సులువుగా నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు మొగ్గుచూపుతారు. ఈ-పేమెంట్స్‌ చేసే వినియోగదారులు, దుకాణాల్లో వాటిని వాడే వ్యాపారుల నుంచి ప్ర‌ధానంగా వినిపిస్తున్న డిమాండ్ ప‌న్ను రాయితీలు. ఒక ప‌రిమితికి మించి న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు ప‌న్ను రాయితీల‌ను ప్ర‌క‌టించాలి. ప్రభుత్వం ఎంతవరకు బ‌డ్జెట్లో వీటిని పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

9. గ్రామీణ ప్రాంత సవాళ్లు:

9. గ్రామీణ ప్రాంత సవాళ్లు:

నగదు రహిత ఆర్థిక వ్యవస్థను వేగంగా ప‌ట్టాలెక్కించేందుకు మరికొన్నిసవాళ్లను అధిగమించాల్సి ఉంది. వాటిల్లో మొదటిది నిరక్షరాస్యత... రెండోది, గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన లేమి. వారిలో కేవలం 22శాతం మంది ఇంటర్నెట్‌ని అప్పుడప్పుడు వాడుతున్నారు. కేవలం ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనే అధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్లను, డెబిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేకపోవడం, ఏటీఎంల కొరత, విద్యుదీకరణ లేకపోవడం వంటివీ దాటాల్సిన అడ్డంకులే. ఈ బడ్జెట్‌లో యుద్ధ ప్రాతిపదికన విద్యుదీకరణపై దృష్టిపెడితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ముగింపు

ముగింపు

నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలంటే ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎక్కువ‌గా జ‌ర‌గాలి. చెక్కులు, డెబిట్‌ క్రెడిట్‌ కార్డుల వినియోగం పెర‌గాలి. కానీ ఇప్పటికీ మనదేశంలో బ్యాంకు ఖాతాలున్న వారి సంఖ్య తక్కువ. ఉన్నా వాడే వారి సంఖ్య బాగా తక్కువ. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో వృద్ది మంద‌గించింద‌ని అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. దీంతో డిజిట‌ల్ లావాదేవీల పెంపుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి. ఇందుకోసం ప్ర‌త్యేక నిధుల కేటాయింపు ద్వారా అది సాధ్య‌మ‌వుతుందేమో చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+